home page

"ముందు వరుసలుంటివా...అన్నో విలేకరీ... మొదటి దెబ్బ మీకెనా... అన్నో విలేకరీ"

జర్నలిస్టులను చిన్నచూపు చూస్తున్న్ తెలంగాణ సర్కారు
 | 
telangana government negligence on journalists

ఒక అరాచక జీవన విధానం... ఒక క్రమశిక్షణా రాహిత్యమే కరోనా పాండెమిక్ లో ఎక్కువ మంది పాత్రికేయులు, విలేకరులు అసువులు బాసేందుకు కారణమవుతున్నదా. ఇంత సంక్లిష్ట సమయం లో కూడా తెలంగాణ లాంటి రాష్ట్రాలు వాళ్లను ముందువరుస సైనికులుగా గుర్తించడం ఎందుకు ఇబ్బంది అవుతున్నది.

మిత్రులు చాలా మంది మనను ఫ్రంట్ లైన్ వర్కర్లు గా ముఖ్యమంత్రి గుర్తించారని చెప్పి హెల్త్ డైరెక్టర్ ప్రకటించారు గదా అని చెప్పొచ్చు. ఆ పద బంధంతో మనల్ని ఫ్రంట్ లైన్ వారియర్లు అని గుర్తించినట్టే అని తృప్తి పరచవచ్చు.ఆ తృప్తి తో మన ఆక్సీజన్ లెవల్లు తాత్కాలికం గా పెరుగవచ్చు.

నిజానికి తెలంగాణ వచ్చిన తర్వాత పాత్రికేయులకు ప్రత్యేక గుర్తింపు వస్తాదేమో అని భావించిన చాలామంది నా బోటి జర్నలిస్టులకు ముఖ్యమంత్రి మొదటి పర్యటన సందర్భంగా ఓ పాత్రికేయ మిత్రుడు రామోజీ ఫిల్మ్ సిటీ భూములపై ప్రశ్నించిన తరుణంలో వెలువరించిన వ్యాఖ్యలు, వరంగల్ నిట్ లో ఓ రెండు ఛానళ్ల యాజమాన్యాలనుద్దేశించి పాతాళంలోకి తొక్కుతానంటూ చేసిన శపథాలు ఆందోళనను రేకెత్తించాయి.

చర్విత చరణాలు అవసరం లేదు. ఎన్నికలున్న ప్రతీ సందర్భం లో ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో పాత్రికేయులకు తాయిలాలు ప్రకటించడం ఆనవాయితీగా మారిన తర్వాత గూడా పాత్రికేయుల హక్కుల పరిరక్షణ కోసం హామీ ఇచ్చిన ట్రేడ్ యూనియన్లు ఏమి చేయలేకపోయాయి. దానికి జర్నలిస్టుల యూనియన్లకున్న పరిధి కారణం అనుకోవచ్చు.

అవన్నీ ఒక ఎత్తు. కరోనా పోయినేడు లాక్ డౌన్ వైపు దారులేసినప్పుడు హైదరాబాద్ లో మొదలయిన పాత్రికేయ వ్యతిరేక ధోరణి తర్వాత తాత్కాలికంగాసద్దుమణిగింది.

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో పోరాడి సాధించుకున్న ప్రెస్ అకాడమీ మీడియా అకాడమీగా రూపాంతరం చెందిన తర్వాత ఆ అకాడమీకి నిధుల కేటాయింపు పెంచి పాత్రికేయ వృత్తి, సంక్షేమాన్ని సెంట్రలైజ్ చేసి ఆ అకాడమీ ద్వారానే సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ లో సెంట్రలైజ్డ్ గా జరుగుతున్న ఆ కార్యాచరణ ఫలితం గా జర్నలిస్టు కుటుంబాలు, మృతిచెందిన జర్నలిస్టుల కుటుంబ సభ్యులు అనేకం లబ్ధి పొందారు. దాన్ని ఎవరూ విభేదించరు.

10 journalists died due to COVID-19 in Telangana in April | The News Minute

కరోనా సందర్భం గా ముఖ్యం గా రెండో వేవ్ లో పదుల సంఖ్యలో జర్నలిస్టులు మృతిచెందుతున్న క్రమం లో జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్లు అనాలనే ఒక ఆకాంక్ష వెలువడ్డది. స్వతహాగానే కుడుం అంటే పండగఅనే మనస్తత్వాన్ని పుణికి పుచ్చుకునే జర్నలిస్టులు ప్రతిఫలాపేక్ష లేకుండా వార్తా సేకరణ కోసం ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి సమాచారాన్ని అందించాలనే గురుతర బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. దీన్ని కూడా ఎవరూ విభేదించరు.

అయితే వాళ్ల వృత్తి నిర్వహణ దశలో వాళ్లు అరాచక జీవన విధానానికి అలవడ్డం వల్ల కనీసం పాత్రికేయులను ఫ్రంట్ లైన్ వారియర్ అనే పదం తో గౌరవించగలిగే అవకాశం ఉండాలని కోరుకోవడం ఒక ప్రజాస్వామిక ఆకాంక్ష.

తెలంగాణ ఉద్యమ కాలం లో మన ఆకాంక్షలన్ని ప్రజాస్వామికం అనుకున్న వాళ్లం కాబట్టి అలాంటి ప్రజాస్వామిక ఆకాంక్ష ఏదయినా సమర్థించాలని కోరుకోవడం తప్పు కాదనుకుంటా.

- పీ.వీ.కొండల్ రావు