Bhupendra Patel : గుజరాత్ లో అంతమంది తోపులుండగా.. ఆయనే సీఎం ఎందుకయ్యారు..?
Latest National News

Bhupendra Patel : గుజరాత్ లో అంతమంది తోపులుండగా.. ఆయనే సీఎం ఎందుకయ్యారు..?

Bhupendra Patel : గుజరాత్‌‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా విజయ్ రూపానీ నిన్న రాజీనామా చేయడంతో కొత్త ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్(Bhupendra Patel) ని గుజరాత్ బీజేపీ శాసనసభా పక్షం ఎన్నుకుంది. ముందునుంచి ముఖ్యమంత్రి పదవి పటీదార్‌ కమ్యూనిటీకి చెందిన నాయకుడికే దక్కుతుందని అందరికీ తెలిసిందే. అందులో భాగంగానే డిప్యూటీ సీఎం నితిన్ పటేల్, వ్యవసాయ మంత్రి ఆర్‌సీ ఫల్దూ, హోంమంత్రి గోర్థన్‌ జడాఫియా పేర్లు ప్రముఖంగా వినిపించాయి. కానీ ఎవరు ఊహించని పేరు ఫైనల్ గా తెరపైకి వచ్చింది. ఆయనే భూపేంద్ర పటేల్.. రేపు భూపేంద్ర ప‌టేల్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేయనున్నారు.

ఇంతకీ ఎవరీ భూపేంద్ర ప‌టేల్ ?

  • భూపేంద్ర ప‌టేల్ అసలు పేరు భూపేంద్రభాయ్ పటేల్.. వయసు 59ఏళ్ళు..
  • పటీదార్ సామాజికవర్గానికి చెందిన నాయకుడు.. ప్రభుత్వ పాలిటెక్నిక్ నుంచి సివిల్ ఇంజినీరింగ్ డిప్లొమా పొందాడు.
  • గతంలో అహ్మదాబాద్‌లోని మెమ్నాగర్ మున్సిపాలిటీ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, అహ్మదాబాద్ అర్బన్ డవలప్‌మెంట్ అథారిటీ స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా కూడా పనిచేశారు.
  • అహ్మదాబాద్‌లోని ఘట్లోడియా నియోజకవర్గం నుంచి 2017లో మొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. కాంగ్రెస్ అభ్యర్థి శశికాంత్ పటేల్‌ను 1,17,000 ఓట్ల తేడాతో ఓడించాడు, అప్పట్లో అత్యధిక గెలుపు కావడం విశేషం.
  • కేంద్ర మంత్రి అమిత్‌‌షా ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న గాంధీనగర్ లోక్‌‌సభ సీటులో బాగమే ఈ ఘట్లోడియా అసెంబ్లీ నియోజకవర్గం ఉంటుంది.
  • గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత యూపీ గవర్నర్ ఆనందిబెన్ పటేల్‌‌ 2012లో ఇదే నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు.
  • ఆనందీబెన్ పటేల్‌కు భూపేంద్ర సింగ్ మంచి నమ్మకస్తుడిగా పేరుంది.
  • వాస్తవానికి ఘట్లోడియా నియోజకవర్గం నుంచి ముందుగా ఆనందీబెన్ పటేల్ కుమార్తె అనర్బహెన్ పోటీ చేయించాలని భావించారు.. కానీ అనూహ్యంగా ఆ సీటు భూపేంద్ర ప‌టేల్ కి దక్కింది.
  • భూపేంద్ర పటేల్ పేరును మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీయే ప్రతిపాదించడం విశేషం.
  • ఐదేళ్ల తర్వాత బీజేపీ మళ్లీ పటీదార్‌ కమ్యూనిటీకి చెందిన నాయకుడిని ముఖ్యమంత్రిని చేసింది.

ఈయనకే ఎందుకు ముఖ్యమంత్రి పదవి?

గుజరాత్ రాష్ట్ర జనాభాలో మొత్తం పటీదార్లు 15 శాతం ఉన్నారు. మొత్తం 182 నియోజకవర్గాలు ఉండగా.. వాటిలో 71 నియోజకవర్గాల్లో పటీదార్లే కీలకంగా ఉన్నారు. అప్పట్లో పటీదార్ రిజర్వేషన్ల వివాదం నేపథ్యంలో తనకు ఎంతో నమ్మకస్తురాలైన ఆనందిబెన్ పటేల్‌ను తప్పించి ఆ స్థానాన్ని విజయ్ రూపానీతో భర్తీ చేశారు మోదీ. విజయ్ రూపానీ పేరుకే సీఎం అయినప్పటికీ ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షాలదే పెత్తనంగా నడిచింది. రాష్ట్ర ప్రభుత్వంలో నిర్ణయాలు ఎవరు తీసుకుంటారు అన్నది అక్కడి నాయకులకి, అధికారులకి బాగా తెలుసు.

2022లో అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా, గుజరాత్‌లో సీఎంను మారుస్తారని చాలా రోజుల నుంచి చర్చ నడుస్తోంది. అనుకున్నట్లుగానే మార్పు జరిగింది. విజయ్ రూపానీ నమ్మకస్తుడే అయిన మాస్ లీడర్ కాదు. స్పీచ్ లతో ఓటర్లను ఆకట్టుకునే సత్తా ఆయనకీ లేదు. 2017లో రూపానీని ముఖ్యమంత్రిగా చూపించి బీజేపీ ఎన్నికలకు వెళ్తే… సీట్ల సంఖ్య 99కి పడిపోయింది. 182 స్థానాలున్న గుజరాత్‌లో 2012లో బీజేపీ 115 గెలుచుకుంది. మళ్లీ విజయ్ రూపానీని సీఎంగా చూపించి ఎన్నికలకి వెళ్తే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది. అటు గుజరాత్ లో కాంగ్రెస్ కూడా పుంజుకుంటుంది. అందుకే ఎన్నిలకలకి ఏడాది ముందుగానే సీఎం మార్పు చేసింది అధిష్టానం.

వచ్చే ఎన్నికల్లో పటీదార్ రిజర్వేషన్ ఓట్లు కీలకం, అందుకే ముందుగా ఆ కమ్యూనిటీకి చెందిన నాయకుడిని ఎంచుకొని వారిని సాటిస్ఫై చేసేసింది.. అయితే ఆ కమ్యూనిటీకి చెందిన లీడర్లు చాలా మందే ఉన్నారు. రాష్ట్ర స్థాయి నుంచి కేంద్ర మంత్రుల వరకు తోపుతోపు లీడర్లు చాలానే ఉన్నారు కానీ.. ఇందులో ఓ చిన్న లీడర్ అయిన భూపేంద్ర ప‌టేల్ ని ఎంపిక చేసింది. భూపేంద్ర ప‌టేల్ ఇప్పటివరకు జిల్లా, నియోజకవర్గ స్థాయిలోనే పనిచేశారు. పెద్దగా ఫాలోయింగ్ కూడా లేదు. ఇప్పుడు మోదీ, అమిత్ షాలకి సొంత నిర్ణయాలు తీసుకునే వాడికన్నా అధిష్టానం చెప్పింది వింటూ చెప్పు చేతల్లో ఉండేవాడు కావాలి కాబట్టి. ఎందుకంటే ఎన్నికల ముందు సొంత నిర్ణయాలు తీసుకుని పార్టీకి తలవంపులు తెస్తే పార్టీకి వచ్చే డ్యామేజ్ ఎక్కువ..

సొంత రాష్ట్రంలో పట్టుకొల్పోతే మోదీ ఇమేజ్ బ్యాలెన్స్ తప్పే అవకాశం ఎక్కువే ఉంటుంది. తద్వారా గుజరాత్ ఎన్నికలు రాబోయే పార్లమెంట్ ఎన్నికల ఫలితాలను తలకిందులు చేసే అవకాశం ఉంటుంది.

Also Read :