Nathu Singh : ఉత్తర్‌ప్రదేశ్ జిల్లా ముజఫర్‌నగర్లో ఉండే ఈ తాత పేరు నాథూసింగ్ వయసు 85 ఏండ్లు. కాటికి కాలుసాపి కృష్ణారామా అనుకుంటూ బతికే దయనీయ పరిస్థితి. మనకు తెలవనిదేముందీ ముసలొల్ల కష్టాలు.? ఒంటికి పోరాదూ.. రెంటికి కూసోశాతగాదూ.. పండుకుంటే పక్కలు మంటలేస్తయి.. కూసుంటే కాళ్లు గుంజుతయి.. నిలవడే సత్తువుండదు. ఇవన్నీ ఎట్లనో అట్ల తిప్పలవడుకుంటూ ఆ ముసలి బండిని లాగుదామనుకుంటే మరి తిండి సంగతేంది? ఎవరు పెడ్తరు తిండి?
అట్లనీ ఆయ్నెకు పిల్లల్లేక కాదు. నలుగురు ఆడిబిడ్డెలు.. ఒక కొడుకున్నడు. తోడుగా ఉన్న భార్య కాలం చేసింది.. ఒక్కడే ఉంటున్నడుగానీ తిన్నట్టు లేదూ పన్నట్టు లేదూ.! అల్లారుముద్దుగా చూసుకున్న కొడుకు.. ప్రేమగా పెంచిన బిడ్డెలు నాథూసింగ్‌ను(Nathu Singh) దగ్గర్కి రానియ్యలేదు. కుక్కలకూ.. పిల్లులకూ తోడితోడి పెట్టే గొప్ప మనసుగల నాథూసింగ్ కొడుకు ఇంటి గడప తొక్కనియ్యలేదు. మీరన్నా వంతుల లెక్క చూస్కోండ్రని బిడ్డెలను బతిమిలాడితే సాల్ సాల్ తియ్యీ.. నీ సక్కదనం అని తరిమేసిండ్రు. ఏంజెయ్యాల్నో తెల్వలేదు. ఎటువోతన్నడో కూడా అర్థంగాలేదు.
ఎన్ని కష్టాలువడి పెంచి పెద్దజేస్తి.. సదివిచ్చి పెండ్లీలు జేస్తీ.. ఒక్కపూట బుక్కెడు బువ్వవెట్టనీకె వీళ్లకు గింత కష్టమైతుందా? నా భుజాలమీదెత్తుకొని తిరిగిన పిల్లలకు ఇప్పుడు నేను బరువైతున్ననా? అని దుఃఖం ఆపుకోకుండా కండ్లల్ల నీళ్లింకిపోయిందాక ఏడ్శిండు. ఇది తన పరిస్థితేగాదూ.. దునియా మీద మొత్తం గిట్లనే సాగుతున్నదీ.. ఒకన్ని జూసి ఒకడు అయ్యవ్వను కుక్కకంటే హీనంగా చూస్తున్నడు.. ఏదో గుణపాఠం జెప్పాలె అని మన్సుల అనుకున్నడు. గత ఏడు నెల్ల నుంచి ఒక వృద్ధాశ్రమంలో ఉంటూ కాలమెల్లదీస్తున్న నాథూసింగ్ ఒక కఠిన నిర్ణయం తీస్కున్నడు.
తన పేరుమీదున్న కోటి యాబైలక్షల ఆస్తిని సర్కారుకు ఇస్తున్నట్లు వీలునామా రాశిండు. ఇంకో కఠినమైన నిర్ణయమేందంటే.. తను సచ్చిపోయినంక బిడ్డెలు.. కొడుకు సావుకు రావొద్దనీ.. తన శరీరాన్ని మెడికల్ కాలేజీకి దానమిస్తున్నట్లు దాంట్ల రాశిండు. ఇగ ఆ పైసలతోని తన పేరు ఇస్కూల్‌గానీ.. దవఖానగానీ పెట్టాలె అని కోరుకున్నడు. పాపం.. ఆ ముసలి గుండెకెంత బాధకలిగిందో.? ఏ తండ్రీ తన పిల్లలు ఆగం కావాలని సూడడుగానీ.. నాథూసింగ్ దీన్ని సమాజానికొక గుణపాఠంగా చెప్పాలనుకుని ఈ నిర్ణయం తీసుకొని ఉండొచ్చు.!
Credit
Daayi Sreeshailam
Also Read :