home page

టీకాలే లేనప్పుడు తోక్కాలో కాలర్ ట్యూన్ ఎందుకో..! 

 | 
టీకాలే లేనప్పుడు తోక్కాలో కాలర్ ట్యూన్ ఎందుకో..!


కరోనా సీజన్.. ఎవరికి ఫోన్ చేయాలన్నా భయం వేస్తుంది.. ఎవరి దగ్గరనుంచి అయినా ఫోన్ వస్తే ఎత్తాలంటే భయం వేస్తుంది. ఏం వార్త వినాల్సి వస్తుందో అని ఒక పక్క హైరానా పడుతుంటే ఈ కాలర్ ట్యూన్ ఒకటి.. విసిగించి చంపేస్తుంది.. కరోనా కట్టడికి వ్యాక్సిన్ ఒక్కటే పరిష్కారం అని చెబుతూ వస్తున్న కాలర్ ట్యూన్ వినీ వినీ జనం చెవులు చిల్లులు పడుతున్నాయి. 

మనం వినేది ఒకటి బయట జరిగేది ఒకటి. కరోనా భయంతో వ్యాక్సిన్ వేయించుకోవడానికి జనం క్యూలు కడుతున్నారు. కొన్ని చోట్ల అసలే వ్యాక్సిన్ ఉండట్లేదు. వ్యాక్సిన్ కోసం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఎదురు చూస్తున్నారు దేశ ప్రజలు. ఇదే విషయాన్ని ప్రశ్నిస్తోంది ఢిల్లీ హైకోర్టు. టీకా ఒక్కటే మార్గం. ప్రతి ఒక్కరు టీకా వేయించుకోవాలని వస్తున్న కాలర్ ట్యూన్ గురించి ఏమనుకోవాలని అక్కడ చూడబోతే వ్యాక్సిన్ లు అందుబాటులో లేవు. మరి అలాంటప్పుడు ఆ కాలర్ ట్యూన్ కచేరీ ఎందుకని ప్రభుత్వాన్ని దుయ్యబట్టింది. 

ఈ కాలర్ ట్యూన్ జనాల సహనాన్ని పరీక్షిస్తోందని కోర్టు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. టీకాలే లేనప్పుడు ఎవరైనా ఎలా తీసుకోవాలి అసలు ఈ సందేశంతో ఏం చెప్పదలుచుకున్నారు అని జస్టిస్ విపిన్ సంఘీ, జస్టిస్ రేఖా పల్లితో కూడిన ఢిల్లీ హై కోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. ఉచితంగా వద్దు సార్.. డబ్బులు తీసుకుని అయినా వ్యాక్సిన్ వేయండి, మా ప్రాణాలు కాపాడండి అని జనం మొర పెట్టుకుంటున్నారని కోర్టు ప్రభుత్వ చర్యలను తప్పు పట్టింది. ఒక్క ట్యూన్ ని పదే పదే వినిపించే కంటే , ఎక్కువ సందేశాలు రూపొందించి మార్చి మార్చి వినిపించాలని కోరింది. 

ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్స్, సిలిండర్ల వాడకం, టీకాలపై జనాలకు అవగాహన కల్పించడానికి బుల్లి తెర నటీనటులను, వెండి తెర సూపర్ స్టార్స్ ని భాగస్వామ్యం చేయాలని ఆదేశించింది. వీలైనంత త్వరగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని కోర్టు ఆదేశించింది. కోవిడ్ వచ్చిన కొత్తల్లో చేతులు కడుక్కోవడం, మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం వంటి అంశాల గురించి భారీ ఎత్తున ప్రచారం చేశారని, ఇప్పుడు కూడా అలాంటి కార్యక్రమాలతో పాటు ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్, మందులు మొదలైన వాటి వాడకంపై కూడా కార్యక్రమాలు రూపొందించాలని కోర్టు తెలిపింది. 

ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కోవిడ్ నిర్వహణపై ప్రచారం చేయడానికి ప్రభుత్వం  ఏ చర్యలు తీసుకోబోతోందని అనే దానిపైన, అలాగే డయలర్ ట్యూన్ల విషయంలో కూడా ఏ నిర్ణయం తీసుకోనుంది అనే దాని గురించి మే 18 లోగా తమకు నివేదిక సమర్పించాలని కోర్టు కేంద్ర, ఢిల్లీ ప్రభుత్వాలను ఆదేశించింది.