Anantapur : టీడీపీని వీడి వైసీపీలో చేరి తప్పు చేశానని రాప్తాడు మండలం ముచ్చుమర్రి గ్రామానికి చెందిన ముచ్చురామి రామాంజనేయులు అనే వ్యక్తి మాజీ మంత్రి పరిటాల సునీత కాళ్లు పట్టుకున్నారు. ఈ ఘటన అనంతపురం(Anantapur) జిల్లా రాప్తాడు మండలం మరూరు గ్రామంలోజరిగింది. మరూరు గ్రామంలో జరిగిన ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో భాగంగా పరిటాల సునీత అక్కడ పర్యటించారు.
అందులో భాగంగా రామాంజనేయులు పరిటాల సునీత కాళ్లు పట్టుకుని ‘నన్ను క్షమించమ్మా 2019 ఎన్నికల సమయంలో వైసీపీలో చేరి తప్పు చేశానమ్మా’ అంటూ వాపోయాడు. అతన్ని పైకి లేపి ఆప్యాయంగా మాట్లాడిన సునీత… జరిగిందేదో జరిగింది కానీ ఎప్పటికీ మీలాంటి వాళ్లకు టీడీపీలో చోటు ఉంటుందని ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.