కెవ్వుకేక.. బాహుబలి ఫేమ్ మోహన భోగరాజు బోనాల పాట

ఊరీకి ఉత్తరాన.. దారీకి దక్షిణాన… నీ పెనిమిటి కూలినాడమ్మా.. రెడ్డమ్మ తల్లి సక్కానైన పెద్ద రెడ్డమ్మా

అని పాడిన అద్భుతమైన గొంతు ఆమెది.

ఇరుక్కుపో.. హత్తుకుని వీరావీరా….. కొరుక్కుపో.. నీ తనివి తీరాతీరా.. అంటూ బాహుబలిలో వినిపించిన విరహగీతం కూడా ఆమె పాడిందే..

నువ్వూగినా ఉయ్యాలా… ఒంటరిగా ఊగాలా.. నువ్వెదిగిన ఎత్తే కనబడకా.. అంటూ శతమానం భవతిలో శ్రావ్యమైన గొంతుకూడా ఆమెదే..

ఆమె ఎవరో కాదు.. ప్రముఖ ఫిమేల్ ప్లేబ్యాక్ సింగర్, బాహుబలి ఫేమ్ మోహన భోగరాజు. సూపర్ హిట్ పాటలతో గుర్తింపుతెచ్చుకున్న ఈ హైదరాబాదీ సింగర్.. మొట్టమొదటిసారిగా తన హై ఎనర్జిటిక్ వాయిస్ తో ఓ బోనాల పాట పాడారు.

తెలంగాణ రాష్ట్ర పండుగ అయిన బోనాల పండుగ సందడిలో భాగంగా.. సుప్రద క్రియేషన్స్ సంస్థ.. ప్రత్యేకంగా బోనాల పాటను రూపొందించారు. ప్రముఖ సంగీత దర్శకురాలు ఎంఎం శ్రీలేఖ ఈ  పాటకు బాణీ కట్టి.. సంగీతం అందించడం విశేషం. తంగెళ్ల శ్రీదేవిరెడ్డి రాసిన ఈ పాటను.. అంతే ఉత్సాహంగా… అంతే వినసొంపుగా పాడారు ఎనర్జిటిక్ వాయిస్ ఉన్న మోహన భోగరాజు. ఈ పాటలో మోహన భోగరాజు, శ్రీలేఖ కూడా కనిపించారు. 

“ఆషాఢ మాసమొచ్చిందీ.. అమ్మవారు పుట్టింటికి బైలెల్లింది.. అదే మన బోనాల జాతర.

యాప మండలు గుమ్మాల జుట్టి.. పసుపు బండారు గడపలకద్దీ…

కుంకుమ బొట్టు కుండకు పెట్టి.. గంధం తీరుగ గదవళ్ల రుద్ది..

ఆడబిడ్డలు వరుసలు గట్టంగ.. పట్టుబట్టలు ధగధగ మెరవంగ..

యాట పిల్లలు ఎన్నంటి నడువంగ.. డప్పుల మోతలు గలగల మోగంగ..

అమ్మా మైసమ్మ తల్లీ..

బోనం ఎత్తి వస్తున్నమే తల్లీ.. కల్లుసాకను తెస్తున్నమే..”

అంటూ హుషారుగా సాగిపోతుంది ఈ పాట.

లేట్ గా వచ్చినా కూడా లేటెస్ట్ గా వస్తా అన్నట్టుగా.. ఈ పాట బోనాల జాతర మొదలైన తర్వాత వచ్చింది కానీ.. ఇప్పటికే విడుదలైన పాటలను మించి ప్రజాదరణ పొందుతోంది. విని చూసినవాళ్లంతా ఫిదా అయిపోతున్నారు. ఈ మధ్య వరుసగా వచ్చిన ఒకేతీరు పాటలతో పోల్చితే.. ఈ పాట భిన్నమైన ట్యూన్ తో.. సినిమాటిక్ జోష్, ఫీల్ తో సాగిపోయింది. ఈ పాటను మీరూ ఓసారి చూసి ఎంజాయ్ చేయండి.