తన్నుకునుడొక్కటే తక్కువ.. రచ్చ రచ్చ..!

నిప్పుకు చెదలు పట్టడం అంటే ఏమిటో అనుకుంటారు గానీ ఒకప్పుడు నిబద్ధతతో గౌరవప్రదమైన జీవితాన్ని గడిపిన రామచంద్రమూర్తి, దేవులపల్లి అమర్‌ ఇప్పుడు ఇలా మారిపోవడాన్ని చూసిన తర్వాత పతనానికి ఎవరూ అతీతులు కారని….

ఏపీ మీడియా వార్ తారాస్థాయికి చేరింది. జగన్ సర్కారు  మీడియా నియంత్రణకు జారీ చేసిన చేసిన జీవో 2430 జర్నలిస్లుల మధ్య యుద్ధంగా మారింది.  ఈ జీవో వాక్ స్వాతంత్ర్యానికి విరుద్ధమని వాదిస్తున్న జర్నలిస్టులు, రాజకీయ నేతలకు సీనియర్ పాత్రికేయులు దేవులపల్లి అమర్, రామచంద్రమూర్తి కౌంటర్ ఇవ్వడం అగ్నికి ఆజ్యం పోసినట్టయింది. జర్నలిస్టులుగా తమపోరాటానికి మద్దతు ఇవ్వకపోగా, జగన్ సర్కారుకు వత్తాసు పలుకుతారా అంటూ చాలా మంది పాత్రికేయులు అమర్, రామచంద్రమూర్తిపై రుసరుసలాడుతున్నారు.

ఇక ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఈవారం తాజాకలం ఈ ఇద్దరు వృద్ధ జర్నలిస్టులకు కర్రు కాల్చి వేత పెట్టారు. ముఖ్యంగా తన దగ్గర పనిచేసిన రామచంద్రమూర్తిని ఓ రేంజ్ లో ఆడుకున్నారు. ‘కె.రామచంద్రమూర్తి. ఆంధ్రజ్యోతి పునఃప్రారంభం నుంచి అయిదున్నరేళ్ల పాటు సంపాదకుడుగా మా సంస్థలో పనిచేశారు. పత్రికారంగంలో గౌరవాభిమానాలు సంపాదించుకున్న ఆయన ఇప్పుడు ఒక్కసారిగా తన స్థాయిని దిగజార్చుకుని జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వ చర్యలను సమర్థిస్తూ మాట్లాడటం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది.

సీనియర్‌ మోస్ట్‌ సంపాదకుడుగా గుర్తింపు పొందిన ఆయన శుక్రవారంనాడు విలేకరుల సమావేశంలో రెండు సందర్భాలలో అవాస్తవాలు చెప్పారు. మీడియాను కట్టడి చేయడానికి రాజశేఖర్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెచ్చిన జీవోను అప్పట్లో తాను సమర్థించానని రామచంద్రమూర్తి చెప్పుకున్నారు. ఇది పూర్తిగా అవాస్తవం. అప్పుడు ‘ఆంధ్రజ్యోతి’ సంపాదకుడుగా ఉన్న ఆయన ‘హద్దుమీరిన అసహనం’ పేరిట రాజశేఖర్‌ రెడ్డి ప్రభుత్వ చర్యను ఆక్షేపిస్తూ సంపాదకీయం రాశారు.

 1994–2004 మధ్య ఎన్టీఆర్, చంద్రబాబు ప్రభుత్వాలలో మీడియాపై దాఖలు చేసిన కేసుల సంఖ్య ఐదుకు మించలేదనీ, రాజశేఖర్‌ రెడ్డి అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే దాదాపు పాతిక కేసులను మీడియాపై పెట్టారనీ నాటి సంపాదకీయంలో రామచంద్రమూర్తి ఆక్షేపించారు. ’ఇలా రామచంద్రమూర్తిపై ఫైర్ అయ్యారు. పత్రికలపై పరువునష్టం దావాలు వేయడం, వేయించడంలో రికార్డు సృష్టించిన జయలలితను మించిపోవాలని రాజశేఖర్‌ రెడ్డి తహతహలాడుతున్నట్టున్నారని అప్పుడు విమర్శించిన రామచంద్రమూర్తి… ఇప్పుడు ఆనాటి జీవోను సమర్థించానని చెప్పుకోవడం ద్వారా పాత్రికేయ లోకానికి ఏమి సమాధానం చెప్పుకుంటారని ప్రశ్నించారు.

ఏపీ మీడియా వార్, ap media war, ys jagan, abn radhakrishna
ap media war

అంతేకాదు… చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సాక్షి విలేఖరులపై కేసులు పెట్టడాన్ని కూడా తాను అప్పట్లో సమర్థించానని రామచంద్రమూర్తి మరో అవాస్తవం చెప్పారన్నారు రాధాకృష్ణ. అప్పుడు సాక్షిలో పనిచేసిన ఆయన చంద్రబాబు ప్రభుత్వ చర్యను తూర్పారబట్టారు. అంతేకాదు, ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాకు కూడా ఫిర్యాదు చేశారని గుర్తు చేశారు.

శుక్రవారంనాడు విలేఖరుల సమావేశంలో చేసిన వ్యాఖ్యలకు, జగన్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను సమర్థించినందుకు రామచంద్రమూర్తికి బహుశా రాత్రికి నిద్రపట్టి ఉండదని,  ఒకవేళ ఆయన మనస్సాక్షిని చంపుకొని ఉంటే హాయిగా నిద్రపోయి ఉంటారని సెటైర్ వేశారు. సాక్షి ఎడిటోరియల్‌ డైరెక్టర్‌గా ఉన్న సమయంలో ఆ పత్రిక ఎవరి ప్రయోజనాల కోసం పనిచేసిందీ, ఎన్ని తప్పుడు వార్తలను ప్రచారం చేసిందీ ఆయనకు తెలియదనుకోలేం కదా? అలాంటి పెద్దమనిషి ఇప్పుడు ఇతర పత్రికలు అవాస్తవాలు రాస్తున్నాయని ఆక్షేపించడం విడ్డూరంగా ఉందన్నారు రాధాకృష్ణ.

రాధాకృష్ణ కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పత్రికలలో వచ్చే వార్తలపై ప్రభుత్వం ఇచ్చే ఖండనలకు మీడియా అంత ప్రాముఖ్యత ఇవ్వడంలేదని కూడా రామచంద్రమూర్తి ఆక్షేపించారు. రెండు దశాబ్దాలకుపైగా సంపాదకుడుగా వ్యవహరించిన ఆయనకు ఈ విషయంలో నెలకొల్పబడిన సంప్రదాయాలు తెలియవనుకోవాలా? ఖండనలు, వివరణలను పస ఉన్నా, లేకపోయినా విధిగా ప్రచురించాలన్న నియమాన్ని ‘ఆంధ్రజ్యోతి’ పెట్టుకున్న విషయం అయిదున్నరేళ్లపాటు మా సంస్థలో సంపాదకుడుగా పనిచేసిన ఆయనకు తెలియదా? రామచంద్ర మూర్తి పాత్రికేయ వృత్తిలో అడుగుపెట్టక ముందునుంచీ వివరణలు, ఖండనలకు వివిధ పత్రికలు ఎంత ప్రాధాన్యం ఇస్తూ వచ్చాయో, ‘ఆంధ్రజ్యోతి’ కూడా అంతే ప్రాధాన్యం ఇస్తూ వచ్చిందని గుర్తు చేశారు.

అమర్ ను వదల్లేదు

                దేవులపల్లి అమర్ ను కూడా ఆర్కే ఉతికి ఆరేశారు. ‘ఈయనగారివి ఒకప్పుడు వామపక్ష భావాలు. నిన్నమొన్నటి వరకు జర్నలిస్టు సంఘాల నాయకుడిగా పత్రికా స్వేచ్ఛ కోసం గళం విప్పిన వ్యక్తి. జగన్‌ సొంత మీడియాలో కొలువు సంపాదించగానే ఆయన తన సహజ స్వభావానికి భిన్నంగా వ్యవహరించడం మొదలుపెట్టారు. ‘అసత్యాలు రాస్తుంటే చూస్తూ ఊరుకోవాలా?’ అని శుక్రవారం నాడు విలేకరుల సమావేశంలో ఆయనే హుంకరించారు.

నిన్నటివరకు తాను పనిచేసిన జగన్‌ మీడియా చంద్రబాబు ప్రభుత్వంపైన, అంతకుముందున్న ముఖ్యమంత్రులపైన ఎలాంటి అభూతకల్పనలు, అసత్య ప్రచారాలు చేసిందో మరచిపోయారా? అని ప్రశ్నించారు. నాడు రాజశేఖర్‌ రెడ్డి, నేడు జగన్మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే మీడియాకు లక్ష్మణ రేఖ ఉండాలన్న విషయం ఈయనగారికి గుర్తుకు వస్తుందని ఎద్దేవా చేశారు.  రోశయ్య, కిరణ్‌ కుమార్‌ రెడ్డి, చంద్రబాబు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు జగన్‌ మీడియా అన్ని కట్టుబాట్లను చెరిపేసి రెచ్చిపోయినా లక్ష్మణ రేఖ విధించాలన్న విషయం గుర్తుకు రాలేదని తన తాజాకలంలో రాశారు.

నిప్పుకు చెదలు పట్టడం అంటే ఏమిటో అనుకుంటారు గానీ ఒకప్పుడు నిబద్ధతతో గౌరవప్రదమైన జీవితాన్ని గడిపిన రామచంద్రమూర్తి, దేవులపల్లి అమర్‌ ఇప్పుడు ఇలా మారిపోవడాన్ని చూసిన తర్వాత పతనానికి ఎవరూ అతీతులు కారని భావించక తప్పదంటూ ముక్తాయించారు ఆర్కే.  దీర్ఘకాలం శ్రమించి విశ్వసనీయత సంపాదించుకున్నవారు సైతం జీవిత చరమాంకంలో సౌకర్యవంతమైన జీవితం కోసం ప్రభుత్వాల పంచన చేరిపోతున్నారని పేర్కొన్నారు.

                మరి ఆర్కే తాజాకలంలో వ్యాఖ్యలకు అమర్, రామచంద్రమూర్తి ఏ విధంగా స్పందిస్తారో చూడాలి..

… సందేశ్