BRS Joinings : కారెక్కేది వాళ్లేనా..? సోషల్ మీడియాలో ఏందీ లొల్లి..?
Latest Telangana

BRS Joinings : కారెక్కేది వాళ్లేనా..? సోషల్ మీడియాలో ఏందీ లొల్లి..?

Political Heat in Telangana over BRS joinings : తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఓ విచిత్ర పరిస్థితి కొనసాగుతోంది. ఇది రాజకీయంగా పెనుదుమారం రేపుతోంది. మాజీ మంత్రి, ప్రస్తుత బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పేరును రాష్ట్ర అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తావించారు. దానికి ఒక రోజు ముందు ఇద్దరు బీజేపీ నేతలు ఫార్మ్ హౌస్ లో కేసీఆర్ ను కలిశారని సోషల్ మీడియాలో గుప్పుమంది. ఈ రెండు సంఘటనలు ఇప్పుడు రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పెంచాయి.

పార్టీలు అన్నాక జంపింగ్.. జపాంగ్ లు ఖాయం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీలో ఉన్న ముఖ్యనేతలు, గతంలో బీఆర్ఎస్ (BRS joinings) లో పనిచేసిన నేతలు.. కాషాయ కండువాను పక్కనపెట్టబోతున్నారనే ప్రచారం ఊపందుకుంది. అయితే.. ఆ నేతలు ఎవరనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. దీనిపై అటు బీజేపీలో, ఇటు బీఆర్ఎస్ లో వాడీవేడీ చర్చ జరుగుతోంది.

ఇదే సమయంలో అసెంబ్లీలో ఈటల పేరు ప్రస్తావనకు రావడంతో ఈటల కూడా కారెక్కబోతున్నారా..? అనే చర్చ జోరుగా సాగుతోంది. టీవీల్లో, పేపర్లలో, సోషల్ మీడియాలో ఇప్పుడు దీనిపైనే జోరుగా చర్చ జరుగుతోంది.  వాస్తవానికి ఈటల బీఆర్ఎస్ (BRS joinings) నుంచి వెళ్లిపోయాక ఆయన ఒకట్రెండు సార్లు కేసీఆర్ ప్రస్తావించారు. కానీ ఈటలను తీవ్రంగా విమర్శిస్తూనే మాట్లాడారు. ఒక రకంగా చెప్పాలంటే ఈటలను తిట్టారు. కానీ ఇప్పుడు ఈటల పేరును చాలా పాజిటివ్ గా ప్రస్తావించడంతో తెర వెనకాల ఏదో జరుగుతోందనే ప్రచారం మొదలైంది.

అయితే.. నిజంగానే ఈటల పార్టీ మారుతున్నారా? ఇటీవల ఫార్మ్ హౌస్ లో కేసీఆర్ ను కలిసిన బీజేపీ నేతలు ఎవరు అనేది అంతుపట్టడం లేదు. బీజేపీలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ఆధారంగా ఓ నలుగురైదుగురు నేతల పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కానీ వీటిపై అధికారికంగా ఇప్పటి వరకు ఎవరూ స్పందించలేదు. తమకు తెలియదని బీజేపీ వర్గాలు చెబుతున్నా.. పార్టీ పెద్దలకు వాళ్లకు  కాస్తో కూస్తో సమాచారం ఉందని టాక్.

ఇక బీఆర్ఎస్ లో అయితే.. ఈ న్యూస్ తో కొత్త టెన్షన్ మొదలైందట. పార్టీలోకి వచ్చేవాళ్లెవరు..? వాళ్లు వస్తే తమ సీటుకు ఎక్కడ ఎసరు వస్తుందోనని గుండెలు గుప్పిట్లో పెట్టుకుని కూర్చున్నారని టాక్. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న ఒకరిద్దరు పేర్లతో అక్కడున్న బీఆర్ఎస్ నేతలు పరేషాన్ అవుతున్నారట. అటు బీజేపీ నేతలు గానీ, ఇటు బీఆర్ఎస్ నేతలు గానీ దీనిపై నోరు మెదపడం లేదు.

ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ ఇష్యూ ఏంటంటే.. అసలు ఎవరు ఏ పార్టీలోకి రావడం లేదు.. కావాలనే ఓ ఇష్యూ క్రియేట్ చేసి జనంలోకి వదిలారనే ప్రచారం కూడా ఉంది. ప్రజల నాడి ఏంటో తెలుసుకునేందుకు చీకట్లో బాణం వేశారని కొందరు మాట్లాడుకుంటున్నారు. అయితే ఈ రెండు ప్రచారాల్లో వాస్తవం ఎంత ఉందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడక తప్పేలా లేదు.

Read Also :