మామది ఓ లెక్క.. అల్లుడితో మరో లెక్క.. అన్నీ తప్పుడు లెక్కలేనట..!

ఏ ఒక్కరు చెప్పిన లెక్కకు.. మరొకరు చెప్పిన లెక్కతో పొంతన లేదు. ఇందులో సీఎం చెప్పింది నమ్మాలా..? ఆర్థికమంత్రి చెప్పింది నమ్మాలా.? కాగ్ చెప్పింది నమ్మాలా..?

రాష్ట్రం అప్పుల్లో మునిగిపోయిందని అపోజిషన్ పార్టీలు గగ్గోలు పెడుతున్నాయి. బంగారు తెలంగాణ కాస్త అప్పుల తెలంగాణ అయ్యిందని ఆరోపిస్తున్నాయి. కానీ అధికారపక్షం మాత్రం మొన్నటి దాకా.. అప్పులు లేవు.. ఏమీ లేవని.. మనది సర్ ప్లస్ లో ఉన్న రాష్ట్రమని చెప్పుకొచ్చింది.

కానీ ఇవాళో రేపో బంగారు తెలంగాణ అవుతుందని అనుకుంటున్న మన రాష్ట్రం ఏ స్థాయిలో అప్పుల్లో మునిగిందో అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకోక తప్పలేదు సర్కారు. అయితే అక్కడ కూడా నోటికొచ్చిన లెక్కలు చెప్పి.. ముఖ్యమంత్రి కేసీఆర్, ఆర్థికమంత్రి హరీశ్ రావు అడ్డంగా బుక్కయ్యారు. అసలు లెక్కలు చూస్తే.. బంగారు తెలంగాణ సంగతి దేవుడెరుగు ఈ అప్పులు ఎలా తీర్చాలో తెలియక తల పట్టుకోవడం ఖాయం.

ఆదివారం రోజున అసెంబ్లీలో కేసీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రం 2 లక్షల కోట్ల అప్పుల్లో ఉందని చెప్పారు. అదే రోజున శాసనమండలిలో మాట్లాడిన మంత్రి హరీశ్ రావు.. రాష్ట్ర అప్పు లక్షా 28 వేల 153 కోట్ల రూపాయలు ఉందని చెప్పారు.

ఇవన్నీ పక్కన పెడితే.. అదే రోజున కాగ్ ఓ రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఆ రిపోర్ట్ ప్రకారం రాష్ట్ర అప్పు లక్షా 42 వేల కోట్లు.

ఏ ఒక్కరు చెప్పిన లెక్కకు.. మరొకరు చెప్పిన లెక్కతో పొంతన లేదు. ఇందులో సీఎం చెప్పింది నమ్మాలా..? ఆర్థికమంత్రి చెప్పింది నమ్మాలా.? కాగ్ చెప్పింది నమ్మాలా..?

నిజానికి రాష్ట్ర అప్పు 2 లక్షల 81 వేల కోట్లని అన్ని లెక్కలు తిరగేస్తే తెలుస్తోంది. దీనికి తోడు కాళేశ్వరం ప్రాజెక్టు అప్పు 18 వేల కోట్లు. ఇవి కాకుండా మిషన్ భగీరథ, ఇతర ప్రాజెక్టులు, కార్పొరేషన్లకు ప్రభుత్వ షూరిటీతో అప్పులు తెచ్చారు. వీటి భారం కూడా రాష్ట్ర సర్కారుదే. అంటే.. మొత్తం 3 లక్షల కోట్ల అప్పుల కుప్ప తెలంగాణ నెత్తి మీద కూసుందన్నమాట.

తెలంగాణ వచ్చినప్పుడు రాష్ట్ర అప్పు 75 వేల కోట్లు. కానీ బంగారు తెలంగాణలో 75 వేల కోట్లను 4తో గుణకారం చేసి 3 లక్షల కోట్లకు తీసుకొచ్చారు. ఇక్కడితో ఆగుతారా..? అంటే అదీ లేదు. మరిన్ని అప్పులు బరాబర్ తీసుకొస్తామని అసెంబ్లీ సాక్షిగానే చెప్పారు ముఖ్యమంత్రివర్యులు. ఇక చెప్పేదేముంది. పాలకులు చేసేది చూసుకుంటూ ఉండటం తప్పితే.