మళ్లీ అదే మాట.. “దాల్ మే కుచ్ కాలా హై”..!

ఎన్ని పేపర్లకు ఇంటర్వ్యూలిచ్చినా.. ఎన్ని టీవీలలో మాట్లాడినా.. అక్కడేం లేదు.. అసలేం లేదని చెప్పినా.. అక్కడ మాత్రం ఏదో ఉంది.! ఏదో జరుగుతోంది..! ఇంకా ఏదో జరగబోతోందన్నది మాత్రం నిజం. అక్కడ అంటే ఎక్కడో కాదు.. టీఆర్ఎస్ పార్టీలో. రాజకీయాల్లో కొడుకులను ఉన్నత స్థానాల్లో కూర్చో బెట్టాలని.. వారసత్వం కట్టబెట్టాలని ప్రతీ రాజకీయ నాయకుడికి ఉంటుంది. ఇక్కడా అదే జరుగుతోంది.?

టీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావుకు పొగబెట్టే పనులు వేగంగా.. కాస్త గట్టిగానే జరుగుతున్నాయా..? ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే ఇది కచ్చితంగా నిజమే అనుకోవాల్సి వస్తోంది. ఇప్పుడు టీఆర్ఎస్ లో రెండు వర్గాలున్నాయి. ఒకటి కేటీఆర్ వర్గం..  దీనినే కొందరు బంగారు తెలంగాణ బ్యాచ్ పిలుచుకుంటున్నారు. ఇంకోటి హరీష్ రావు వర్గం.. దీనిని ఉద్యమ తెలంగాణ బ్యాచ్ అని పిలుచుకుంటున్నారు. బంగారు బ్యాచ్ కన్నా ఉద్యమ బ్యాచే కాస్త గట్టిగా ఉంది. పబ్లిక్ లో ఫాలోయింగ్ ఉందనేది అందరికీ తెలిసిన విషయమే.

ఇదే ఇప్పుడు హరీష్ రావుకు ఇబ్బందిగా మారినట్టు కనిపిస్తోంది. ఆ బలాన్ని తగ్గించేందుకు.. కావాలనే పార్టీలో అణగదొక్కుతున్నారని.. ఆయన వర్గం వారికి సీట్లు ఇవ్వడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. నిన్నటి ప్రెస్ మీట్ లో కొండా సురేఖ స్వయంగా ఈ మాట చెప్పారు. తాను హరీష్ రావు వర్గం కాబట్టే సీటు ఇవ్వలేదన్నారు. కేటీఆర్, కవిత అడ్డుకున్నారని కూడా చెప్పారు. హరీష్ రావు పైనా తీవ్రమైన ఒత్తిడి ఉందని.. ఆయన చాలా బాధలో ఉన్నారని వివరించారు.

అయితే హరీష్ రావు మాత్రం.. తాను బాగానే ఉన్నానని చెబుతున్నారు. టీఆర్ఎస్ లోనే ఉంటానని అంటున్నారు. తనపై ఎలాంటి ఒత్తిళ్లు లేవంటున్నారు. సభల్లో మాత్రం ఉధ్వేగంగా మాట్లాడుతున్నారు. పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలకు కాస్త దూరంగానే ఉంటున్నారు. కేసీఆర్ కు బంధువే అయినా.. ఇప్పుడు ఆయన టీఆర్ఎస్  లో ఓ పరాయి వ్యక్తిగా.. మామూలు నేతగానే కనిపిస్తున్నారు. దీనికంతటికి కారణం ఏంటీ..? ఎవరు చెబుతున్నది నిజం.?

ఏది ఏమైనా.. దాల్ కుచ్ కాలా హై..! అనేది మాత్రం నిజం.