హుజుర్ నగర్ లో రేవంత్ ఓడారా..? ఉత్తమ్ నెగ్గారా..?

మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి నెగ్గినట్టా..? ఓడినట్టా..? అనే దానిపై పార్టీలో తీవ్రంగా చర్చ జరుగుతోంది. తన అభ్యర్థికి టికెట్ ఇప్పించుకోలేకపోయిన రేవంత్ రెడ్డి హుజుర్ నగర్ బైపోల్ లో సహకరిస్తారా..? తన వర్గం ఓట్లు కాంగ్రెస్ కు పడకుండా అడ్డుకుంటారా..?

రాజకీయాల్లో లాబీయింగ్ మీదే పనులు జరుగుతాయి. కాంగ్రెస్ లో అది మరింత ఎక్కువగా ఉంటుంది. ఎన్నికల్లో సీట్లైనా, పార్టీలో పదవులైనా.. లాబీయింగ్ గట్టిగా ఉంటేనే సాధ్యం అవుతుంది. ఇప్పుడు అదే జరిగిందని కాంగ్రెస్ పార్టీలో ప్రచారం జరుగుతోంది.

త్వరలో జరగనున్న హుజూర్ నగర్ ఉప ఎన్నికల కాంగ్రెస్ అభ్యర్థిగా పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య… ఉత్తమ్ పద్మావతి పేరును ఖరారు చేసింది ఏఐసీసీ. దీనికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు కూడా ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇదే నియోజకవర్గం నుంచి గెలిచారు. తర్వాత ఎంపీ ఎన్నికల్లో గెలవడంతో శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు ఉత్తమ్.

ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గం కావడంతోనే ఆయన భార్య పద్మావతికి టికెట్ ఇచ్చారనే మాట వినబడుతోంది. అయితే.. ఇందులో భారీగానే రాజకీయం జరిగిందనే చర్చ జరుగుతోంది. ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ పకడ్బందీగా జరిగిందని కాంగ్రెస్ లోని కొందరు నేతలంటున్నారు.

నిజానికి.. హుజుర్ నగర్ టికెట్ విషయంలో కాంగ్రెస్ లోని రెడ్ల మధ్య పెద్ద యుద్ధమే నడిచింది. హుజుర్ నగర్ టికెట్ తాను సూచించిన అభ్యర్థి కిరణ్ రెడ్డికే ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం ముందు ప్రతిపాదన పెట్టారు రేవంత్ రెడ్డి. తాను ప్రతిపాదించిన వ్యక్తికే ఖచ్చితంగా టికెట్ ఇచ్చితీరాలన్నారు.

కానీ.. రేవంత్ రెడ్డి ప్రతిపాదనను నల్గొండ జిల్లా రెడ్లు తీవ్రంగా వ్యతిరేకించారు. మొన్నటి దాకా ఉత్తమ్ ను తీవ్రంగా వ్యతిరేకించిన కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా ఈ విషయంలో.. ఉత్తమ్ పద్మావతికే తమ సపోర్ట్ అని ప్రకటించారు. రేవంత్ రెడ్డి సూచించిన అభ్యర్థికి ఎట్టి పరిస్థితుల్లో టికెట్ ఇవ్వొద్దన్నారు. తామంతా కలిసి కట్టుగా పనిచేసి పద్మావతినే గెలిపించుకుంటామని శపథం చేశారు.

రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఆయన సూచించిన అభ్యర్థికి టికెట్ రాలేదు. పీసీసీ చీఫ్ భార్యకు టికెట్ ఇచ్చారు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి నెగ్గినట్టా..? ఓడినట్టా..? అనే దానిపై పార్టీలో తీవ్రంగా చర్చ జరుగుతోంది. తన అభ్యర్థికి టికెట్ ఇప్పించుకోలేకపోయిన రేవంత్ రెడ్డి హుజుర్ నగర్ బైపోల్ లో సహకరిస్తారా..? తన వర్గం ఓట్లు కాంగ్రెస్ కు పడకుండా అడ్డుకుంటారా..? అనేది ఇఫ్పుడు కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్ గా మారింది.