సండే స్పెషల్ : నోరూరించే తమాట తొక్కు

కిల వంద రూపాలు, నూటిరవై రూపాలు మొన్నటిదాకా తమాటల ధర. మార్కెట్లకు వోతే వాటిమొకాన సూద్దామంటే కూడా దైర్న్యం రాకపోతుండే. సూసీసూడనట్టు పోయేటోన్ని. తమాట తొక్కు సై సూడక దగ్గెరదగ్గర మూణ్నెళ్లయితంది. పదిరవై వెట్టి కిల తమాటలు తెచ్చి తొక్కు నూరుకొని తింటే ఏ మటన్, ఏ చికెన్ కూడా పనికిరాకపోతుండే దానిమీద. రెండు వారాలకోసారి మూడురోజులు తిన్నా బుద్ధి తీరకపోతుండే. అసువంటిది ఎన్నిరోజులాయె తమాట తొక్కు సై సూడక.

తమాటల రేటు తగ్గిందటని మొన్నో దోస్తు ఫేసు బుక్కుల వెడితే సూసి మార్కెట్‌కు పోయిన.. ఆ.. కిలిరివై.. కిలిరివై.. ఆ.. తమాట కిలిరివై కిలిరివై.. అంటే కిల తమాటలు తెచ్చి తమాట తొక్కు నూరుకొని తిన్న. తమాట తొక్కు తినక సప్పిడి వడ్డ నాలిక ఇయ్యాల్ల నాట్యం చేసింది. నా చిన్నప్పుడు మా అమ్మమ్మ ఆగవ్వ తమాట తొక్కును రోట్లేసి రుబ్బుతా ఉంటే సూసి నేర్సుకున్నా.. ఇప్పుడు మీకు నేర్పిస్తా సూడుర్రి తమాట తొక్కు ఎట్ల నూరుడో..

తమాట తొక్కుకు కావలసినవి...
నూనె 5 పావులు, కిలో తమాటలు, పచ్చిమిరపకాయలు 200 గ్రాములు, ఎల్లిపాయగడ్డలు 2, జిలకర రెండు శెంషెలు, పసుపు ఒక శెంషె, ఎండిన మిరపకాయలు 8. పూదీన కట్ట 2, కొత్తమీర కట్ట-2, కల్యమాకు ఒక రెమ్మ.

ఎల్లిపాయలు పొట్టు తీసుకొని బందుకు పెట్టుకోవాలె. తమాటలను చిన్నచిన్న ముక్కలుగా చేసుకొని పక్కకు వెట్టుకోవాలి. పచ్చి మిరపకాయల తొడిమెలు తీసి అడ్డంల రెండు ముక్కలు చేసుకోవాలె. పూదీనా, కొత్తిమీర కట్టలను తెంపుకొని పెట్టుకోవాలి.
ఇప్పుడు పొయ్యంటించి ముకుడు పెట్టుకోవాలె. ముకుడు వేడిగైనంక మూడు పావుల నూనె పోసుకోవాలె. నూనె కూడా వేడిగైనంక కోసిపెట్టుకున్న మిరపకాయ ముక్కలను ఆ నూనెల వేసుకోవాలె. మంచిగ గోలినంక ఆ ముకుడు నుంచి మిరపకాయ ముక్కలను తీసుకొని మిక్సీల వేసుకోవాలె. అదే ముకుడుల ఇంకో పావు నూనె పోసుకొని తమాట ముక్కలను వెయ్యాలె, కొద్దిసేపు గోలినంక తెంపిపెట్టుకున్న పూదీనా, కొత్తిమీరను కూడా తమాటలల్ల వేయాలె, సరిపడా ఉప్పు, చిటికెడు పపుసు కూడా వేసుకోవాలె. పొయ్యి సిమ్ముల వెట్టుకొని ఇప్పుడు మిక్సీకాడికి పోవాలె.

గోలిచ్చిన మిరపకాయ ముక్కలల్ల పొట్టుతీసి పెట్టుకున్న ఎల్లిపాయలు, ఒక శెంశె జిలకర్ర వేసుకొని మిక్సీ పట్టాలె. తమాటలు మెత్తగ ఉడికినంక పులుసు లెక్క అయితది. ఈ పులుసును ఫ్యాన్‌గాడుపుకు సల్లారవెట్టుకోవాలె. కొద్ది సేపయినంక మిక్సీ పట్టిన మిరపకాయలల్ల ఈ తమాట పులుసును కలిపి మళ్లోసారి మిక్సీ పట్టుకోవాలె. మళ్లోసారి పొయ్యి ముట్టించి ముకుడు పెట్టుకోవాలె. ముకుడు వేడిగైనంక ఓ పావు నూనె పోసుకోవాలె. ఆ నూనె వేడయినంక అందులో జీలకర్ర వేసుకోవాలె. తెంపిపెట్టుకున్న కల్యమాకును, ఎండు మిరపకాయలను కూడా వేసుకొని మంచిగ గోలినంక కొంచెం పసుపు వేసుకోవాలె. ఈ తాలింపును మిక్సీ పట్టుకున్న తమాట తొక్కుల పోసుకోవాలె. అంతే తమాట తొక్కు రెడీ.. వేడివేడి అన్నంల ఈ తమాట తొక్కేసుకొని తింటే నా సామిరంగా ఉంటది సూడు మజా, ఆహా… మన తెలంగాణల తమాట తొక్కుకున్న ఆ క్రేజే వేరు.

ఇదే తమాట తొక్కును మన ఇంటి ఆడోళ్లను చేయిమంటే (ఉత్తగనే జోకుగా) అర్జున్‌రెడ్డి సినిమా లెక్క మూడుగంటలు చేస్తరు. అదే నేనయితే షార్ట్‌ఫిల్మ్ లెక్క ముచ్చటగా ముప్ఫై నిమిషాల్లో చేస్తా. మా అమ్మమ్మ ఆగవ్వ రోట్లె రుబ్బేది తమాట తొక్కు, నేను మిక్సీల రుబ్బినా అంతే తేడా మిగతా అంతా సేం టు సేం.

..సతీష్ గడ్డం