ఎన్ కౌంటర్ ఎలా జరిగిందంటే..?

శంషాబాద్ సమీపంలో వెటర్నరీ డాక్టర్ పై లైంగిక దాడి చేసి హత్య చేసిన నిందితుల ఎన్ కౌంటర్ కు సంబంధించిన వివరాలు వెల్లడించారు సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్. నిన్న నిందితులను తాము కస్టడీలోకి తీసుకున్నామన్నారు. మరింత విచారణ కోసం తెల్లవారుజామున స్పాట్ కు తీసుకెళ్లామన్నారు. నలుగురు నిందితులను తీసుకుని పదిమంది పోలీసులు చఠాన్ పల్లిలోని స్పాట్ వెళ్లారన్నారు సీపీ.


ఎన్ కౌంటర్ ఎలా జరిగిందంటే..?


నిందితులను స్పాట్ కు తీసుకెళ్లి బాధితురాలి ఫోన్ రికవరీ చేసేందుకు ప్రయత్నించామన్నారు. అయితే.. ఇక్కడ పెట్టాం.. అక్కడ పెట్టాం అని.. నిందితులు కాసేపు తిప్పారన్నారు. చివరకు దాచిపెట్టిన చోటు చూపించారన్నారు. స్పాట్ నుంచి బాధితురాలి ఫోన్, వాచ్, పవర్ బ్యాంక్ రికవరీ చేసినట్టు సజ్జనార్ చెప్పారు.
చీకటిగా ఉండటంతో నిందితులు తప్పించుకునేందుకు ప్రయత్నించారన్నారు. కేసులో A1గా ఉన్న ఆరిఫ్ మొదట తుపాకీ లాక్కున్నాడని… తర్వాత రెండో నిందితుడు చెన్నకేశవులు కూడా పోలీసుల దగ్గర నుంచి తుపాకీ లాక్కుని కాల్పులు జరిపాడని చెప్పారు సీపీ. ఇదే అదనుగా మరో ఇద్దరు నిందితులు కూడా రాళ్లు, కర్రలతో పోలీసులపై దాడి చేశారని చెప్పారు.
సరెండర్ కావాలని నిందితులను కోరామని.. అయినా వినిపించుకోకుండా తమపై కాల్పులు జరిపారని చెప్పారు సీపీ. ఎంత చెప్పినా వినకపోవడంతోనే కాల్పులు జరపాల్సి వచ్చిందన్నారు. పది నుంచి పది హేను నిమిషాల పాటు ఫైరింగ్ జరిగిందని.. తర్వాత వెళ్లి చూస్తే నలుగురు నిందితులు చనిపోయి ఉన్నారన్నారు. నిందితుల నుంచి తుపాకులు రికవరీ చేసినట్టు చెప్పారు.
నిందితుల దాడిలో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయని చెప్పారు సీపీ. రాళ్లు, కర్రలతో కొట్టడంతో ఇద్దరు అధికారులు గాయపడ్డారని.. వారిని కేర్ హాస్పిటల్ కు తరలించి ట్రీట్మెంట్ చేస్తున్నట్టు చెప్పారు.


వీళ్లంతా పాత నేరస్తులేనా..?


నలుగురు గతంలో ఏమైనా నేరాలు చేశారా..? వారిపై ఏమైనా కేసులున్నాయా అనే కోణంలో ఎంక్వైరీ చేస్తున్నామన్నారు. ఇదే మోడెస్ అపరెండీలో జరిగిన కేసుల వివరాలు సేకరిస్తున్నామన్నారు. పొరుగున ఉన్న రాష్ట్రాల పోలీసులతో సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు.