ఇయ్యాళ్ల పొద్దుగాళ్లటి పూట ఇంత చాయబొట్టు తాగుదామని బయటికి వోతుంటే రోడ్డుపొంటి శెక్కిళ్లు ఎర్రెర్రగున్న రవ్వు శాపలు తెల్లగా తళతళా మెరుస్తున్నయ్. అప్పుడే తెచ్చినట్టున్నరు శెర్లకెల్లి. వాటిని సూస్తనే నోట్లె నీళ్లూరినయ్.
ఛల్ ఇయ్యాళ్ల ఎటూజేసి శాపలకూర తినాల్సిందేనని..
“అన్నా ఎంతనే కిలకు రవ్వు శాపలు”..
“తెలంగాణ శాపల్, కిలకు నూటరవై”..
“ఒహ్హో జోకు మరిగ కిల దుగేది సూసి”..
కిల రవ్వు శాపల్ తీసుకపోయిన.
మటన్, తలకాయ్, బోటి, చికెన్లు అండటం ఒకెత్తయితే, శాపల కూర అండటం ఒకెత్తు. అండటం గురించి పక్కనవెడితే.. ఈ శాపల కూరండే క్రమంలో చిన్నప్పటి ఓ జ్ఞాపకం గుర్తచ్చింది.
……….
“అప్పుడప్పుడే పొద్దు పొడుస్తున్నది. బియ్యంల మెరిగలేరుకుంట ఎటువోయిండో.. అప్పుడనంగా వోయిండు జాడలేడు, పత్త లేడు” బయటికి వోయిన మా బాపు గురించి ఒక్కటే గుణుగుడు మా అమ్మ.
“ఏందే నీ అవ్వా.. తెల్లారంగ తెల్లారంగ రికాం లేకుంట ఒక్కటే మొకాన గుణుగుతున్నవ్… నిద్రవోకుండా” అని మంచంల కెల్లి లేసుకుంట కండ్ల బూసులు తూడుసుకున్న.
“అప్పుడనంగా వోయిండురా, పొద్దెక్కుతంది.. ఇగ రాడు అగ రాడు” అనంగనే మా బాపు సైకిల్ సప్పుడు ఇనవడ్డది. మా వాడ మూల మలుగంగనే మా బాపు సైకిల్ సప్పుడును నేను గుర్తువట్టేది.
“అగ్గో నేనేంజెయ్యాలె.. ఇయ్యాళ్ల మూర్ఖశిల అని ఊరుఊరంతా మార్కెట్లనే ఉంది. గాలిసిరినప్పుడే తూర్పార వట్టాలన్నట్టు ఆ తెనుగోళ్లేమో డబల్కు డబల్ చెప్పుతున్నరు శాపల రేటు ఇయ్యాళ్ల. నువ్విచ్చిన యాభై రూపాలకు తోకమట్టకాడ అస్తయా శాపలు, ఓ బాగొర్రుతున్నవ్”
గుడ్లు పెద్దగ జేసిండు మా అమ్మా మీదికి.
“ఎహే.. మీ శాపలకినా వారెత్తు లొల్లి వెట్టుకోకుర్రే.. గంటసేపు వోతే కిల, రెండు కిలలు పట్టుకొస్తా.. ఇయ్యాళ్ల ఎటూ ఐతారమే కదా… బాపు గాలాలెక్కడున్నయే….”
“రేకుల మీదున్నయ్ సూడురా.. బెండ్లు మంచిగున్నయో లెవ్వో, లేకుంటే కొత్త బెండ్లు కట్టుకో..”
“సరే సరే గనీ, అమ్మా మాసాలలు నూరివెట్టుకోయే పొద్దుగూకే సరికి శాపల్ తీసుకోస్తా.. చిన్నమ్మోళ్లకు, పెద్దమ్మోళ్లకు కూడా చెప్పు, మిగిలితే ఇద్దాం..”
“ఓ పోడ నీ శాపల్ పాడుగాను లేకున్నా మంచిదేరా.. శెర్లకు పోవుడద్దురా” మా అమ్మా దీర్ఘాల్దీసింది.
“మాసాలు గనీ మసాలయితే నూరి పెట్టుకో”
………
ఏడో తరగతి సదువుతున్న రోజులు. మానకొండూర్కు తలాపున పెద్ద శెరువు, శెరువు గట్టుకు పెద్ద ఒర్రె. రేకుల మీదున్న రెండు గాలాలు తీసుకొని ఒర్రెకు బాట వట్టిన.. ఒర్రెకు చేరుకునేసరికి కరెక్టు పది గొట్టింది. ఎండ సుర్రసుర్ర పొడుస్తున్నది. ఆ ఎండకు శాపలు శెంగలిస్తున్నయ్. ఆగుర్రాగుర్రి ఇయ్యాళ్ల మీ పని వట్టుడేననుకొని గాలానికి ఎర్ర గుచ్చి గాలమేసిన. నీ శాపల్ పాడుగాను అటెయ్యంగనే ఇటు ఎర్రలు మాయంజేస్తున్నయ్ గనీ ఒక్క జిమ్మ కూడా వడుతలేదు. గంటయింది, రెండు గంటలయింది, అటీటని తినేటాళ్ల అయితున్నది. కడుపులనేమో పేగులొర్రుతున్నయ్ గుర్ గుర్మని..
నీ అవ్వ ఇంటికాడ పెద్ద పోకిళ్లతనంజేత్తి, ఉత్త చెయ్తోని వోతే అమ్మెంత తిడుతదో, నానేసిన చింతపండు, నూరిన మసాలలు కరాబ్ అయితయని.. ఛల్ ఇయ్యాళ్ల ఆకలికి సచ్చినా మంచిదే శాపల్ లేంది ఇంటికే పోవుడే లేదు నాది నేను మనసులనుకొని ధైర్యంగా కూసున్న. మాంచి లాంట ఎర్ర గాలానికి గుచ్చి తుపుక్కుమని ఉంచి ఒర్రెలకిసిరిన. అటిసురుడు ఆల్శ్యం లేదు. ఇటు బెండు మిట్కరిస్తనే ఉన్నది. లేసిగ్గేటందుకు చేతిల గాలం పట్టుకొని మాంచి మోక మీద వంగిన…
ఎర్ర మింగినట్టుంది శాప.. నేనిటిగ్గుడు, శాపటిగ్గుడు.. ఓ ఐదు నిమిషాల పాటు యుద్ధ వాతావరణం. చివరికి నేనే గెలిసిన. లగాంచిగ్గుతే నీయక్క ఒడ్డుకు వడ్డది పాపెర. “పాపెర” అంటే దొడ్డుకు దొడ్డుకు, ఆరడగుల పొడుగుంటది. పాపెర తింటే పాణానికి మంచిదని మా అవ్వ ఊకె చెప్పే మాట గుర్తొచ్చింది. ఒక్కటే ముల్లుంటది. ఆ ముల్లు తీసి పక్కనవెట్టి మిగితా శాప ముక్క నోట్లేసుకుంటే మటన్ కూడా పనికిరాకపోవాలేనుకొని సంచిలేసుకొని ఇంటి బాట పట్టిన.
…………………
“పోరడు వద్దంటే వాయే, వానికెదురుంగనన్నా పోరాదు.. ఓ మంచం మీద మంచిగ పన్నవ్” మా అమ్మ మాటలు రోడ్డుమీదికినవడుతున్నయ్.
నేన్ కనవడంగనే..
“అగ్గో నా కొడుకు రానే అచ్చిండు మాటలల్ల.. నీ శాపలకగ్గితగుల వద్దంటే పోతివి బిడ్డా గీయాళ్లాయే… అప్పుడెప్పుడు తిన్నవో ఏమో, మొకం, కాల్రెక్కల్ కడుక్కొని ఇంత తినుపోరా.. ” అన్న మా అమ్మకు..