వరల్డ్ కప్ విన్నర్ ‘ఇంగ్లండ్’.. రిజల్ట్ ఇలా ప్రకటించారు!

నెలన్నర రోజులకు పైగా సాగిన వరల్డ్ కప్ అంతిమ సమరంలో ఇంగ్లండ్ జట్టు అత్యంత అరుదైన పద్ధతిలో విజయం సాధించింది. మొట్టమొదటిసారి క్రికెట్ వరల్డ్ కప్ ను ఇంగ్లండ్ ఎగరేసింది. న్యూజీలాండ్ పై ఇన్ని పరుగుల తేడాతో… లేదా ఇన్ని వికెట్ల తేడాతో.. అనే తేడాతో ఈ విజయాన్ని చెప్పలేం. ముందు మ్యాచ్ టై అయింది. తర్వాత.. సూపర్ ఓవర్ కూడా టై అయ్యింది. దీంతో.. ఆ జట్లు కొట్టిన బౌండరీల ఆధారంగా వచ్చిన పరుగులను బేరీజు వేసి.. వరల్డ్ కప్ ఫైనల్ రిజల్ట్ ప్రకటించారు. ఇది చాలా సంక్లిష్టమైన జడ్జిమెంట్. క్రికెట్ రూల్స్ అంతే చెబుతున్నాయి మరి. 

న్యూజీలాండ్ తో జరిగిన క్రికెట్ వరల్డ్ కప్ 2019 ఫైనల్ బహుశా… చాలా ఏండ్లపాటు ఇలాగే గుర్తుండిపోతుందేమో. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజీలాండ్ 50 ఓవర్లలో 241 రన్స్ చేసింది. ఆ తర్వాత ఇంగ్లండ్ 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి సరిగ్గా అన్నే రన్స్ చేసింది. లాస్ట్ ఓవర్ లో 15 రన్స్ కావాల్సిన టైమ్ లో.. స్టోక్స్ సాహసోపేతంగా ఆడాడు. ఓ సిక్సర్ బాదాడు. తర్వాత బాల్ కు .. ఫీల్డర్ విసిరిన త్రో స్టోక్స్ చేతికి తగిలి.. బౌండరీకి వెళ్లింది. ఈ ఫోర్ న్యూజీలాండ్ కొంప ముంచింది. స్కోరు సమం కావడంతో. సూపర్ ఓవర్ నిర్వహించారు. 

ఇంగ్లండ్ బ్యాటింగ్ కు దిగి 2 ఫోర్లతో 15 రన్స్ చేసింది. న్యూజీలాండ్ 1 సిక్సర్ సాయంతో 15 రన్సే చేసింది. మళ్లీ మ్యాచ్ టై. దీంతో బౌండరీల ద్వారా వచ్చిన రన్స్ ఆధారంగా ఫలితం ప్రకటించారు. ఇంగ్లండ్ విజేతగా నిలిచినప్పటికీ.. 2సార్లు నిర్వహించిన మ్యాచ్ లోనూ దీటుగా స్పందించిన న్యూజీలాండ్ కూడా అభిమానుల మనసులో విశ్వవిజేతే.