జర్నలిస్టులు ఊసరవెల్లులేనా…!

రాజకీయ నాయకులకు నైతికత ఉండాలని, జర్నలిస్టులు ఊదరగొడ్తుంటారు. మరి జర్నలిస్టులకు ఆ నైతికత ఉండక్కర్లేదా..? అని కొందరు నేతలు ఎదురు ప్రశ్నిస్తున్నారు

ap media politics

ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం …. సమయ స్ఫూర్తి… లోకజ్ఞానం… ఈ మూడు వేర్వేరు అయినా, స్థూలంగా చూస్తే, అర్థం ఒక్కటే.. వీటిని ఒక్కొక్కరు ఒక్కోలా అన్వయించుకుంటారు అంతే తేడా. తమది సమయ స్ఫూర్తి అనో, లోకజ్ఞానం అనో తమ విధానాలను మార్చుకున్నప్పుడు సమర్థించుకుంటారు. అయితే ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం అని వారి ప్రత్యర్థులు విమర్శిస్తారు.

రాజకీయ నాయకులకు నైతికత ఉండాలని, జర్నలిస్టులు ఊదరగొడ్తుంటారు. మరి జర్నలిస్టులకు ఆ నైతికత ఉండక్కర్లేదా..? అని కొందరు నేతలు ఎదురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే.. ఏపీలో తమకు వ్యతిరేకంగా రాసే వార్తలను నియంత్రించడానికి జగన్ సర్కారు తీసుకొచ్చిన జీవో 2430 రగడ గురించే.

భావప్రకటన స్వేచ్ఛ ను హరించే విధంగా ఈ జీవోను సీనియర్ మోస్ట్ జర్నలిస్టులు, నేటి తరానికి ఆదర్శ ప్రాయులైన రామచంద్రమూర్తి, దేవులపల్లి అమర్ లు  సమర్థించడాన్ని ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం అంటారంటున్నారు జర్నలిస్టులు. ఈ వృద్ధ పాత్రికేయులు సాక్షిలో పని చేసినప్పుడు ఎలాగూ జగన్ భజన చేయక తప్పలేదు.. ఇప్పుడు ప్రభుత్వం పదవులు ఇచ్చాక మరింత స్వామి భక్తిని ప్రదర్శిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఊసర వెల్లులు రంగులు మార్చినట్టు,  రాజకీయ నేతలు పార్టీలు మారుస్తున్నారని, లేదా విధానాలను మార్చుకుంటున్నారని జర్నలిస్లులు రాస్తుంటారు. ఇప్పుడు వీరిద్దరూ ఇదే కోవలోకి వస్తున్నారని  రామచంద్రమూర్తి, అమర్ కింద జర్నలిస్టులే ఆరోపిస్తున్నారు. వార్తలో పనిచేసినప్పుడు రామచంద్రమూర్తి  చంద్రబాబుకు వ్యతిరేకంగా వ్యాసాలు రాశారు. ఆయన ఆంధ్ర్జజ్యోతిలోకి వచ్చాక చంద్రబాబును వదిలిపెట్టి, వైఎస్ మీద పడ్డారు. ఆంధ్రజ్యోతి నుంచి హెచ్ఎంటీవీలోకిచేరాక, కొంత బ్యాలెన్స్ గా హంసధ్వని రాసేవారు. సాక్షిలో చేరాక ఆయన కలం రూట్ మారింది. మళ్లీ చంద్రబాబు వ్యతిరేకంగా వ్యాసాలు వచ్చాయి.

 నిజానికి అమర్, రామచంద్రమూర్తి వివాదాస్పద జీవో గురించి మాట్లాడకుండా ఉంటే సరిపోయేదన్న వాదన జర్నలిస్టు కమ్యూనిటీలో బలంగా వినిపిస్తోంది. ఈ వయస్సులో అనవసరంగా గెలుక్కున్నారని కొందరు జర్నలిస్టుంటున్నారు. ఇక పత్రికా స్వేచ్చను హరించి వేసేలా గతంలో వైఎస్ జారీ చేసిన జీవో చేసినప్పుడు రామచంద్రమూర్తి, అమర్ రాసిన కథనాలు బయటకు తీసి,  జర్నలిస్టులు ఊసరవెల్లులేనంటూ మరి కొందరు విమర్శిస్తున్నారు.