రివ్యూ : “దొరసాని” ఇది సినిమా కాదు.. జీవితం

“అన్నా… హీరో, హీరోయిన్లు సచ్చిపోతరట కదా..? సినిమా ఎట్లుందన్నా సూడాల్నా వద్దా..?”
“హీరో హీరోయిన్లు సచ్చిపోతే ఏందన్నా, సినిమా మాత్రం జీవితాంతం బతికే ఉంటది” సినిమా సూడాల్నా, వద్దా? అని ఆత్రుతగా అడుగుతున్న ఒకన్నకు సినిమా చూసిన ఒకన్న థియేటర్‌లోని సైకిల్ స్టాండ్‌లో చెబుతున్న మాటలివి.

“దొరసాని” ఇది సినిమా కాదు, ముప్ఫై ఏండ్ల కింద జరిగిన ఒక ఘటన.
“గడీల 24 గంటలు అటీటు తిరిగేదాన్ని, మంచి చీర కట్టుకుంటే ఎట్లమ్మా? దొర కంట్లె వడితే చీరను నలిపెయ్యడూ…” తన కంట్లె వడ్డ ప్రతీ ఆడిదాన్ని నలిపెయ్యాలనుకునే గడీల దొర తన బిడ్డ చిన్న దొరసాని మీద మాత్రం ఎవ్వని కన్ను వడద్దనుకుంటడు. దొరసాని మీద పుసుక్కున కన్నవడితే ఏమైతదో చూపించే కథనే ఈ “దొరసాని”..

ఆది నుంచి అంతం వరకు కనిపించే తమ్ముడు “సన్నీ ఎల్ సాప్”, కనవడ్డప్పుడల్లా తన ప్రత్యేకతను చాటుకునే “రైతు బిడ్డ నితిన్”, దొర పెత్తనాన్ని ఎదిరించే “సంఘీర్ భాయ్”, మా పెద్దొరసాని “స్వర్ణ కిలారి”లు ఈ దొరసాని సినిమాకే హైలెట్.

దొర పెత్తనం ఎట్లా కొనసాగుతదో, బూటకపు ఎన్‌కౌంటర్లు ఎట్లా జరుగతయో సూత్తే ఎర్రజెండా ఎత్తి లాల్‌సలాం అని పిడికిలి బిగించి జై కొట్టాలనిపిస్తది.

కేవలం కామెడీ కోసమే వాడుకున్న‌ “తెలంగాణ భాష” ఇట్లా సినిమా కేంద్రంగా నిలుస్తుందని కలల గూడ అనుకోలే…

“వానింట్ల పీనుగెల్లా”, “ముండకొడుకా నీకేం పోయేకాలంరా”, “అన్నలల్ల కలిసిండా ఏంది” లాంటి డైలాగ్‌లు ఇన్నప్పుడల్లా రొమాళ్లు నిక్కవొడుస్తయి. అవమానాలు ఎదుర్కొన్న తెలంగాణ భాష కాలరెగురేసి ఇట్లా తలెత్తుకొని తిరుగడం సూత్తే తెగ సంబురమైంది.

మనం సూడాలె, మనమే సూడాలె, మన సినిమానే సూడాలె, మనం కాకపోతే ఇంకెవ్వరు సూత్తరు. అందుకే సూడండి, సూపించండి, సూసి త‌రించండి, మ‌న‌ తెలంగాణ సినిమాకు జీవితాన్నివ్వండి..

తెలంగాణ, తెలంగాణ భాష నేపథ్యంగా ఇంకో సినిమాను మనకందించిన డైరెక్టర్ కేవీఆర్ మహేందర్‌కు శతకోటి శనార్థులు.

రేటింగ్: 4.1/5

– గ‌డ్డం స‌తీష్‌, 9959059041