ఆర్టీసీ ఖేల్ ఖతం.. సీఎం సంచలన ప్రకటన

వెయ్యిశాతం పాత ఆర్టీసీ రాష్ట్రంలో ఉండదని సీఎం కేసీఆర్ చెప్పారు. హుజూర్ నగర్ ఉపఎన్నికలో గెలుపునుద్దేశించి తెలంగాణ భవన్ మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. ఆర్టీసీ యూనియన్ నాయకులే కార్మికుల కుటుంబాలను రోడ్డునపడేశారన్నారు. భారీగా ఆదాయం వచ్చే పండుగ వేళ బస్సులు బంద్ చేసి.. సీఎంగా తాను నియమించిన కమిటీ విన్నపాలు కాదని… సమ్మెకు వెళ్లిన ఆర్టీసీ కార్మికులు తమను తామే, తమ ఉద్యోగాలను తామే నరుక్కున్నారని అన్నారు. కోర్టుకు వెళ్లినా.. లేబర్ కమిషన్ కు వెళ్లినా .. ఆర్టీసీ సంస్థ లాస్ లో ఉంది కాబట్టి.. డబ్బుల్లేవ్ కాబట్టి.. ఏమీ కాదని అన్నారు. ఆస్తులు అమ్మి వారికి సెప్టెంబర్ నెల జీతాలు మాత్రమే ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు కేసీఆర్. బస్సులో, భూములో ఏదో ఒకటి అమ్మి వారి జీతాలు చెల్లించేస్తే ఆ పని కూడా అయిపోతుందన్నారు.

“ సీఎంగా చెప్తున్నా ఆర్టీసీకి భవిష్యత్ లేదు. యూనియన్లు ఇట్లుంటే ఆర్టీసీ మునుగుడు ఖాయం. కార్మికులను యూనియన్లు చెడగొడుతున్నాయి. ఆర్టీసీ సమ్మెకు.. ఆర్టీసీ ముగింపే జవాబు. నియంత్రణ లేకనే విచ్చలవిడి తనం అయింది. ఐదారు రోజుల తర్వాత ఆర్టీసీపై ఫైనల్ నిర్ణయం తీసుకుంటాం. ఆర్టీసీపై కేబినెట్ నిర్ణయం అవసరం లేదు. ఒక్క సంతకంతో ఆరేడు వేల ప్రైవేట్ బస్సులొస్తాయి” అన్నారు సీఎం.

“రోడ్డున పడితే పడండి.. మాకేంది. కార్మికులు అమాయకులైతే ఎక్కడికక్కడ దరఖాస్తులిచ్చి జాయిన్ అవ్వాలి. సంస్థనే పోతుంటే విలీనం ఎక్కడిది. సమ్మె ముగింపు ఎక్కడిది.. ఆర్టీసే ముగుస్తోంది. ఆర్టీసీ కార్మికులది అసలు సమ్మెనే కాదు. కార్మికులు బుద్ధి, జ్ఞానం ఉండే సమ్మె చేశారా. ఇది ఓ పనికిమాలిన నిర్ణయం. యూనియన్ ఎన్నికల ముందు వాళ్ల స్వార్థం కోసం చేయించారు. పీఎఫ్ ప్రభుత్వం తీసుకోలేదు.. ఇచ్చే సత్తా ఆర్టీసీకి లేదు. ఆర్టీసీ బస్సులతో రోజుకు 3 కోట్ల నష్టం. అద్దె బస్సులతో రోజుకు నాలుగున్నర లక్షల లాభం వస్తుంది. యూనియన్లు ముంచితే.. ప్రభుత్వం కాపాడాలా.. 50వేల జీతం తీసుకునే ఉద్యోగులే తమను తాము ఇబ్బందుల్లోకి నెట్టుకున్నారు. ఆర్టీసీ మునగక తప్పదు.. ఎవ్వడూ కాపాడలేడు. పనికిమాలిన డిమాండ్లతో సమ్మె చేశారు. ఆర్టీసీ కార్మికులది పిచ్చి పంథా. ఆర్థిక పరిస్థితి బాగాలేకే కఠినంగా ఉన్నాం. ఆర్టీసీ అంటే నాకు ప్రత్యేక అభిమానం. గతంలో మూడేళ్లు రవాణామంత్రిగా పనిచేశా. ఆర్టీసీ గురించి నాకంటే ఎక్కువ తెలిసినోడు మరెవడూ లేరు. పూర్తినష్టాల్లో ఉన్న ఈ టైమ్ లో ఆర్టీసీని ఎవడూ కాపాడలేడు” అని కేసీఆర్ చెప్పారు.