చెంగులు జీరాడే పంచెకట్టు, చేతికర్ర, గుబురుమీసాల అచ్చతెలుగు రూపంతో ఎస్వీఆర్ వదిలెళ్ళిన పెద్దరికపు కండువాని సునాయాసంగా దశాబ్దాలపాటు ధరించిన సంపూర్ణ నటుడు.. కటౌట్ చూసి కొన్నికొన్ని నమ్మేయాలి డ్యూడ్ అనే పదానికి సరితూగే నిలువెత్తు ఆజానుబాహువు.. కైకాలంటే విగ్రహం, వైవిధ్యం, విలక్షణం.. సత్యన్నారాయణ ఓ పాత్ర వెయ్యాలంటే దానికో దర్పం, హుందాతనం.. నటునిగా ఆయన స్థాయి, స్థానాల గురించి చెప్పుకోవాలంటే ఈ నటసార్వభౌముని మీద తీసినన్ని ప్రత్యేకగీతాలు మరే నటుని మీదా తీసినట్టు కనబడరు.. అద్దీ రేంజ్ అంటే.. కాబట్టే ఆయన కోసమే తయారైన వేషాలు డజన్లు.. ఈయన మాత్రమే చెయ్యగలిగిన పాత్రలు కోకొలల్లు..కేవలం ఓ ముఖ్యపాత్రతోనే అరవైఐదేళ్ల వయస్సులోనూ ఇండస్ట్రీహిట్టివ్వాలంటే యమలీల.. అతిథిపాత్రల్లో మెరుస్తూ హీరోకి సాయపడాలంటే ఓ గ్యాంగ్ లీడర్ & సమరసింహారెడ్డి.. ప్రధానపాత్రగా సినిమా మొత్తాన్ని మోయాలంటే తాయారమ్మ బంగారయ్య, అమాయకంగా నవ్వించాలంటే అగ్నిపర్వతం, గంభీరంగా కితకితలు పెట్టాలంటే అల్లరిపిల్ల, సెంటిమెంటుతోనే పకపకా నవ్వించాలంటే ఓ అమ్మరాజీనామా రామచంద్రారావు.. ఇవన్నీ ఒకెత్తయితే కరుణ, హాస్య, ఆశ్చర్యరసాల్ని అద్భుతంగా రక్తికట్టిస్తూ కన్నీరుపెట్టించే మాఊళ్ళోమహాశివుడు సాంబయ్య ఒక్కటీ ఒకెత్తు.. ఇవన్నీ ఉదాహరణలు మాత్రమే.. ఇక్కడ పట్టనన్ని మరెన్నో ఉన్నాయ్.
మన తరానికి ఊహతెలిశాకా యముడంటే ఎవర్రా అంటే అది కైకాలే.. మాయాబజార్ గొప్పదనం తెలీని పిల్లతనంలో ఘటోత్కచుడనేవాడు ఒకడున్నాడని తెల్సింది సత్యనారయణగారి వల్లే.. దాదాపు ఓకేలాంటి ఆంగికాహార్యాలతో వందలకొద్దీ విలన్ వేశాలేయ్యొచ్చుగాక.. వాటిలో వైవిధ్యం గురించి మాట్లాడాలంటే ఏడాదితేడాలో వచ్చిన కొండవీటిసింహం నాగరాజుని, శుభలేఖలో అంకెల ఆదిశేషయ్యని పక్కపక్కనే పెట్టి గమనిస్తే చాలు.. విలక్షణం అంటే ఏంటో కొట్టొచ్చినట్టు తెలిసొస్తుంది..! రూపం ఒక్కటే అవ్వొచ్చేమోగానీ సూత్రధారుల్లో నీలకంఠయ్యకి, రాంబంటులో రాజా రామచంద్రప్రసాదుకి ఎంత తేడా..? సింహాసనంలో తంత్రాన్ని నడిపించే రాజగురువులోనూ, సముద్రంలోంచి సాగరకన్యని బయటికి రప్పించే బంగార్రాజులోనూ ఎంత క్రూరత్వం దాగుంది అసలు..? ఇలా రకరకాలుగా నవ్వించినంతసేపూ నవ్వించాడు, భయపెట్టినన్నాళ్ళూ భయపెట్టాడు.. అంతలోనే జయంమనదేలో అరుగుమీద పడుకుని ఊరందర్నీ పలకరిస్తూ సెల్ఫ్ గోల్ వేసుకునే నూనెసుబ్బయ్యగా కనబడి “మనూళ్ళో చూస్తుంటాం కదా ఇలాంటి పెద్దాయన్ని” అనిపించాడు.
ఏ పాత్రలో దూరితే ఆ పాత్రలో నిండైన విగ్రహంతో, తనకే సొంతమైన జీరగొంతుతో అన్ని పాత్రల్నీ అనితరసాధ్యంగా పోషించి అందరి మనసుల్లోనూ సొంతింటిమనిషిగా నిలిచిపోయిన ఈ కైకాల సార్వభౌముణ్ణి ఇన్నాళ్ళూ చాలామంది ప్రేమగా సత్తిగాడన్నారు. కొంతమంది గౌరవంగా కైకాలగారని పిలిచారు. కానీ.. అంతటి ప్రతిభావంతుణ్ణి కనీసం పద్మతోనైనా పురస్కరించుకోలేకపోవడం మాత్రం దారుణం అని ప్రతీఒక్కరూ ఎప్పటికీ బాధపడుతూనే ఉంటారు..!!
Haribabu