home page

ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందో తారకా..? అంటాడు కానీ... 

ఇవాళ సిరివెన్నెల సీతారామశాస్త్రి జన్మదినం
 | 
sirivennala sitharama Shastry biography and songs
- హ్యాపీ బర్త్ డే సీతారామశాస్త్రి

అనగనగా ఓ బాధ్యత గల అంకులు " సురాజ్యమవలేని స్వరాజ్యమెందుకనీ..!" అంటూ నైరాశ్యంలో పాడుకునేవాడు. అప్పుడప్పుడూ " తెల్లారింది లెగండోయ్.. కొక్కొరొక్కో..! అంటూ భవిష్యత్తు మీద ఆశ గలిగినా, " ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమీ..! ఎన్నడూ వదులుకోవద్దురా ఓరిమీ..!" అంటూ ధైర్యం చెప్పుకున్నా, ఎదురుగా కనిపించే వాస్తవం "అర్ధశతాబ్దపు అన్యాయానిని స్వతంత్రమందామా..! స్వర్ణోత్సవాలు చేద్దామా..! అని భయపెట్టేది.

ఆ అంకులుకో కొడుకు. కాలేజీకి వెళ్లే వయసువాడు. "క్లాసురూములొ తపస్సు చేయుట వేస్టురా గురూ...; బైటనున్నది ప్రపంచమన్నది చూడరా గురూ..! అంటూ పైలాపచ్చీసుగా పాడుకునేవాడు. తెలివైనవాడు. మతాన్ని కాకుండా దైవాన్ని నమ్మినవాడు. "దండాలయ్యా ఉండ్రాలయ్యా" అంటూ దండం పెడుతూనే, "ఆది బిక్షువు వాడినేమి అడిగేది...? అంటూ ప్రశ్నిస్తాడు. "ఆనతినీయరా హరా..!" అంటూ అర్ధిస్తాడు.

కుర్రాడి వంటి మీదకు వయసొచ్చింది. "ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందో తారకా..?" అంటూ నిట్టూర్పులు వదలడం మొదలెట్టాడు. కంటికి నదురుగా ఏ అమ్మాయి కనిపించినా "వెయ్యిన్నొక్క జిల్లాల వరకూ నీ అందాల సంకీర్తనే.." అంటూ ఇన్ స్టంటు సన్మానగీతాలు మొదలెట్టాడు.

వాడికి "ఎదలో ఈలవేసే డాళింగ్ డాల్.." లాంటి ఓ డ్రీమ్ గాళ్ కనిపించింది. వెంటనే, " ఎటో వెళ్లిపోయింది మనసూ..! ఇలా వంటరయ్యిందీ వయసు..!" అంటూ కూనిరాగాలు మొదలెట్టాడు. వాడి ప్రేమగాఢతను చూసి ఆ అందగత్తె "నువ్వూ.. నువ్వూ.. నా మనస్సులో నువ్వూ..!" అంటూ నవ్వేసింది. ఇంకేముందీ.. "మేఘాలలో తేలిపొమ్మన్నది, తూఫానులా రేగిపొమ్మన్నది..!" అంటూ ఝాంఝమ్మని అమ్మాయితో బైకేసుకు తిరగడం మొదలెట్టాడు. కాస్త మరుగైతే చాలు.., ఆమె " ఈ వేళలో నువ్వు ఏంచేస్తు ఉంటావో.. మనసున ఉన్నదీ చెప్పాలనున్నదీ..!" అంటూ విరహపు వగలు పోతుంటే, అతను " నీ నవ్వు చెప్పింది నాతో నేనెవ్వరో ఏమిటో...! అనీ, "నీ అడుగు నడవడమే పయనమన్నది పాదం, నేను విడిచీ బ్రతకడమే మరణమన్నది ప్రాణం..! అంటూ విరహపు పొగలు కక్కేసాడు.

ఇరువైపులా పెద్దలకు ఇహ తప్పదని తెలిసి, "అలనాటి రామచంద్రునికన్నింటా సాటి..! అని కుర్రాణ్ని పొగిడేస్తూ, అమ్మాయిని "తెలుగింటి కూనా..! అని మోసేస్తూ రంగరంగవైభవంగా పెళ్లి చేసారు.

కలయా.. నిజమా.. తొలిరేయి హాయి మహిమా అని ఇద్దరూ శోభనప్ఫాట పాడేసుకున్నాక కూడా కుర్రాడు పనీపాటా మానేసి కొత్త పెళ్లాం కొంగట్టుకు తిరగడం మొదలెట్టాడు. ఆ అమ్మాయి " సరసాలు చాలు శ్రీవారూ వేళకాదూ..!" అన్నా వేడుకుంటున్నా వినకుండా "కన్నుల్లో నీ రూపమే.. గుండెల్లో నీ తాపమే..!" అంటూ కొంటెగా సమాధానం చెప్పాడు.

చాలాసార్లు కులుకులూ, అప్పుడప్పుడు అలకలు. చాలాసార్లు "అసలేంగుర్తుకురాదు ఓ నిమిషం కూడా నిన్నుచూడక..!" అన్నా, సంసారపు తిక్కలో మొగుడి మీద అరిచినప్పుడు పెద్దవాళ్ళు "మంగళ సూత్రం అంతటి చవకా కొనగలవా చేజారాకా..? అంటూ సుద్దులు చెప్పేవారు. "ధర్మార్ధకామములలోను ఏనాడూ.." భార్యమాట మీరరాదంటూ అతనికి బుద్ధిచెప్పేవారు.

రోజులు గడుస్తుంటే ఆకుపచ్చని ఆశయై అతన్ని చుట్టుకుని ఆమె చిగురించింది. పిల్లామేకా, ఇల్లూపొల్లూ, గొడ్డూగోదా, పొలమూపుట్రా సమకూరాయి.

వయసూ, అనుభవం పెరుగుతుంటే ఇద్దరికీ "ముసుగువెయ్యొద్దు మనసుమీదా..!" అనే విషయం అవగతమైంది. "చుట్టూపక్కల చూడరా చిన్నవాడా..! చుక్కల్లో చూపు చిక్కుకున్నవాడా..!" అని ఎవరో గురుబోధ చేసినట్టనిపించింది. "జగమంత కుటుంబం, ఏకాకి జీవితం, సంసారసాగరం, సన్యాసం,శూన్యాల" ద్వైతాద్వైతాలు తమవనీ అర్ధమైంది. "ప్రకృతికాంతకు ఎన్నెన్ని కళలున్నాయో, పరవశిస్తే ఎన్నెన్ని లయలుంటాయో" అవగతమైంది. "ప్రాణం పుట్టుక ప్రాణికి తెలియాలా..?" అన్న ప్రాధమిక ప్రశ్న ఉదయించింది.

తద్దరిమిలా వారిద్దరూ పార్వతీపరమేశ్వరుల్లా ఒక్కరేనన్న జ్ఞానం "విరించియై వినిపించి, విపంచియై మనకు వివరించింది.

చేంబోలు సీతారామశాస్త్రి గారికి సాష్టాంగ ప్రణామాలు. మీ పాట చిరంజీవి. ప్రస్తుత సినీగేయరచయితల రాజ్యానికి మీరు స్పర్ధాతీత చక్రవర్తి. నేను అసంఖ్యాక అభిమానుల్లో ఒకణ్ని. మీ దత్తుడు Krishna Vamsi గారి సినీగీతాలు ఇక్కడ ఎక్కువగా ప్రస్తావింపబడడం యాదృచ్ఛికం కాదు.

గొట్టిముక్కల కమలాకర్