Puneeth Rajkumar : నీ జీవితం నిజంగా ‘పునీత’మే..   అభిమానుల గుండెల్లో ఎప్పటికి ‘రాజకుమారుడ’వే..!
Cinema Latest Off Beat

Puneeth Rajkumar : నీ జీవితం నిజంగా ‘పునీత’మే.. అభిమానుల గుండెల్లో ఎప్పటికి ‘రాజకుమారుడ’వే..!

Puneeth Rajkumar: అదేదో సినిమాలో చెప్పినట్టుగా ఓ మనిషిని గుర్తుంచుకోవాలి అంటే అతను వందేళ్ళు బ్రతకాల్సిన అవసరం లేదు.. అతను చేసిన పనులే అతన్ని కొన్ని సంవత్సరాలు మాట్లాడుకునేలా చేస్తాయి. అలా ప్రజల మనుసులో, చరిత్రలో నిలిచిపోయే మహానుభావులు కొందరు మాత్రమే ఉంటారు.. అలాంటి వారిలో పునీత్ రాజ్‌‌కుమార్ (Puneeth Rajkumar ) ఒకరు.. ఆయన అకాల మరణానికి చింతిస్తూ.. ఆయన మరణానికి శ్రద్దాంజలి ఘటిస్తూ..ఆయన పవిత్రమైన ఆత్మకి శాంతికి చేరుకురాలని కోరుకుందాం..

పునీత్ రాజ్‌‌‌కుమార్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.. !

కన్నడ కంఠీరవ, కన్నడ అభిమానులు దైవంగా భావించే నటుడు రాజ్‌‌కుమార్ చివరి సంతానమే పునీత్‌‌రాజ్ కుమార్.. ఆయన అసలు పేరు లోహిత్ రాజ్‌‌కుమార్.. 17 మార్చి 1975లో తమిళనాడు రాష్ట్రం, చెన్నైలో రాజ్‌కుమార్, పార్వతమ్మ దంపతులకు జన్మించారు పునీత్.. ఆయనకి ఇద్దరు అన్నయ్యలు, ఇద్దరు అక్కలున్నారు. కంప్యూటర్ సైన్స్ లో డిప్లొమా పూర్తి చేశారు. ఆరు నెలల వయస్సులో అంటే 1976లో బాలనటుడిగా కెరీర్‌ ప్రారంభించారు పునీత్ . అలా బాలనటుడిగా మొత్తం 13 సినిమాలలో నటించారు పునీత్.. ఇందులో 1985లో వచ్చిన “బెట్టాడ హూవు” చిత్రానికి గానూ ఉత్తమ బాలనటుడిగా ఆయన జాతీయ అవార్డు కూడా అందుకున్నారు. ఈ సినిమాతోనే ఆయన పేరును పునీత్ రాజ్‌‌‌కుమార్ గా మార్చుకున్నారు.

పునీత్ రాజ్‌కుమార్‌ ను హీరోగా పరిచయం చేసేందుకు రాజ్ కుమార్ ఫ్యామిలీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సుమారుగా రెండు సంవత్సరాలు ఎన్నో కథలు విన్నారు. ఫైనల్ గా ఓ తెలుగు దర్శకుడు చెప్పిన కథకి ఒకే చెప్పారు రాజ్ కుమార్.. ఆయనే పూరీ జగన్నాధ్.. దాదాపుగా ఈ కథని రాజ్ కుమార్ కుటుంబంలోని ఓ రెండువందల మందికి ఒకేసారి వినిపించి ఒకే చెప్పించుకున్నారు పూరీ.. అదే అప్పు సినిమాగా 2002లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అప్పటివరకు కన్నడ సినిమాలో ఉన్న అన్నీ రికార్డులను తిరగరాసింది. పునీత్ కి స్టార్ హీరో అనే హోదాకి పునాదులు వేసింది.

ఆ తర్వాత ఇదే సినిమాని తెలుగులో రవితేజ హీరోగా ఇడియట్ సినిమాగా రీమేక్ అయింది. ఆ తర్వాత అభి (2003), వీర కన్నడిగ (2004), మౌర్య (2004), ఆకాష్ (2005), అజయ్ (2006), అరసు (2007), మిలానా (2007), వంశీ (2008), పవర్, బిందాస్, జాకీ, హుడుగారు, అన్న బాండ్, రానా విక్రమ, రాజకుమార లాంటి ఎన్నో హిట్ చిత్రాల్లో నటించారు పునీత్ రాజ్‌కుమార్‌. ఇక్కడ విశేషం ఏంటంటే.. ఆయన నటించిన మొదటి తొమ్మిది చిత్రాలు వందరోజులు పూర్తిచేసుకున్నాయి ఇది ఓ రేర్ రికార్డనే చెప్పాలి.. కన్నడలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరో కూడా ఆయనే కావడం విశేషం. కేవలం నటుడిగానే కాకుండా సింగర్ గా, నిర్మాతగా, పలు టీవీ షోలకి హోస్ట్ గా, పలు ప్రోడక్ట్ లకి బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరించారు.

కేవలం సినిమాలే ఆయనని స్టార్ ని చేయలేదు.. అభిమానుల గుండెల్లో కేవలం హీరోగానే మిగిలిపోలేదు.. రీల్ హీరో నుంచి రియల్ హీరోగా ఆయనని ఆయన మలుచుకున్న విధానం నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. కర్ణాటక రాష్ట్రంలో రాజ్ కుమార్ కుటుంబమన్న అందులోని సభ్యులన్న అక్కడి వారికి అభిమానం మాత్రమే కాదు భక్తి కూడా.. ఆలాంటి కుటుంబం నుంచి వచ్చిన పునీత్ రాజ్ కుమార్ దగ్గర ఎక్కడ కూడా గర్వం కనిపించదు. స్టార్ హీరో అనే పొగరు ఏ మూలన అవుపించదు.. తోటినటులతో ఎంతో ఆప్యాయంగా ఉంటాడు. ఎంతో సన్నిహితంగా మెదులుతాడు.

కుడిచేత్తో దానం చేస్తే ఎడమ చేతికి కూడా తెలియకూడదని అంటారు కానీ ఇప్పడున్న స్మార్ట్ ఫోన్ సొసైటీలో నలుగురుకి ఏం చేసిన పదిరోజులు పబ్లిసిటీ చేసుకునే రోజులివి.. కానీ పునీత్‌ రాజ్‌కుమార్‌. 45 ఉచిత స్కూల్స్ ఏర్పాటు చేసి 1800 మంది విద్యార్థుల‌కు ఉచ్చితంగా చ‌దువు చెప్పించ‌డం, 26 అనాథ ఆశ్రమాలు, 16 వృద్ధుల ఆశ్రమాలు, 19 గోశాల‌లు ఏర్పాటు చేశాడని అయన చనిపోయేవరకు ఎవరికీ తెలియదు. ఇవే ఆయనని అభిమాన నటుడి నుంచి దేవుడ్ని చేశాయి.

పునీత్‌ రాజ్‌కుమార్‌ భార్య పేరు అశ్వనీ రేవంత్ .. వీరిద్దరూ ప్రేమించి పెళ్ళిచేసుకున్నారు.. ముందుగా వీరి పెళ్ళికి పునీత్ తల్లిదండ్రులు ఒప్పుకున్నా.. అశ్వనీ తల్లిదండ్రులు ఒప్పుకోలేదు.. కానీ పునీత్ గురించి పూర్తిగా తెలుసుకొని వారిని తమ ఇంటికి ఆహ్వానించారు. పునీత్, అశ్వనీ దంపతులకి ఇద్దరు కుమార్తెలు ధ్రితి, వందిత ఉన్నారు. ఇక తాను త్వరలో నటించబోయే జేమ్స్ సినిమాలో బాడీ బిల్డర్ గా కనిపించేందుకు పునీత్‌ రాజ్‌కుమార్‌ జిమ్ లో వీపరితంగా కష్టపడ్డారు. ఈ క్రమంలోనే 29 అక్టోబర్ 2021న వ్యాయామం చేస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో బెంగళూరులోని విక్రమ్‌ ఆసుపత్రికి తరలించిగా అక్కడ చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు.

ఆయన మరణాన్ని ప్రకటించడానికి స్టేట్ గవర్నమెంట్ బయపడింది. ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని కన్ఫర్మ్ అయ్యాక కేంద్ర బలగాలను రప్పించి మరి ఆయన మరణవార్తను ప్రకటించింది. కడసారి చూసేందుకు అభిమానులు తండోపతండాలుగా తరలివచ్చారు. కరోనా అని లెక్కచేయలేదు.. తమ ప్రాణాలను సైతం పక్కన పెట్టేశారు. పునీత్ మరణవార్త విని కొన్ని గుండెలు ఆ క్షణమే ఆగిపోయాయి. కన్నడ పరిశ్రమని తలెత్తుకునేలా చేసిన ఓ శిఖరం ఇక లేదని అభిమానుల గుండెలు ఇంకా రోదిస్తూనే ఉన్నాయి.ఇంతమంది అభిమానుల గుండెల్లో చోటు సంపాదించుకున్న నీ జీవితం నిజంగా ‘పునీత’మే.. నీవు వారి గుండెలలో ఎప్పుడు ‘రాజకుమారుడ’వే..!

Also Read :