సందిగ్దం ఎవరికోసం?
Cinema Latest

సందిగ్దం ఎవరికోసం?

ఎవరిని ఉద్దరిస్తున్నామని? ఒక్కొక్కడు ఒక్కో పరిశ్రమగా ఏర్పడి, ఒక్కో కుటుంబంనుండి వారానికి సరిపడ హీరోలు మా మీదకు వదిలి అమాయకుల శ్రమను టికెట్ల రూపంలో పిండుకోలేదా? యువకుల జీవితాలని మీ కటౌట్లకి వేలాడదీసుకోలేదా? చదువులూ, పనులూ మానేయించి జులాయిలని చేయలేదా? ఏకంగా అభిమానాలకోసం వాళ్ల ప్రాణాలని బలిపెట్టలేదా? హీరోలటుంచి ఎంతమంది టెక్నీషియన్లు మీ బంధువులు లేరు? సహనటులు లేరు? నిర్మాతలు, పంపిణీదారులు లేరు?

ఒక్కొక్కరూ ఒక్కో స్టూడియో కోటలని కట్టుకుని రాజ్యాలలాగా ఏర్పాటు చేసుకోలేదా? కేవలం రెండు మూడు కులాలకు మాత్రమే మీ సినిమాల్లో ప్రవేశం వున్నమాట అబద్దమా? ప్రాంతాలవారీగా ఏ సినిమా, ఎప్పుడు, ఎలా, ఎన్నిరోజులు ఆడాలనేది మీరు కాదా నిర్ణయించేది.

సినిమాలు సరిపోక నిజజీవితంలోకి వచ్చి జనాల బలహీనతలమీద మీ సినిమాల వాళ్లు నాటకాలు వేయడంలేదా? రాజకీయ పార్టీలుగా మారలేదా? పార్టీలని, ఓట్లని తిరిగి అడ్డగోలుగా అమ్ముకోవడంలేదా?

ఇంతపొందిన మీరు తిరిగి అమాయక బీద ఇతరకులాల జనానికి ఏమిచ్చారు? సిగరెట్లు, మందు, ఆడపిల్లలని లైన్లో వేయడం, పడకపోతే వేధించడం, కట్టప్ప బానిసత్వాలూ, భక్తి రాసాలూ, వెకిలితనాలూ, బూతు సాహిత్యాలూ సినిమాల్లో; బలిసిపోయిన తనాలూ, డ్రగ్స్, వ్యభిచారం, బ్లాక్‌మనీ మీ బతుకుల్లో ప్రదర్శిస్తోన్న మాట వాస్తవం కాదా?

రోజువారీ వూపిరి సలపని జీవితంలో కాసింత వెసులుపాటు, రోజంతా శ్రమలో రాత్రిపూట వురటనిచ్చే కమ్మనికల అందించాల్సిన మీరు కళామతల్లి పేరుతో అయా ప్రభుత్వాలకు తాబేదార్లుగా మారి బెనిఫిట్ షోలు, ఇష్టమొచ్చిన టిక్కెట్ రేట్లు పెంచుకునే వెసులుబాట్లు, లొకేషన్లకు అనుమతులు, సబ్సిడీలూ, టాక్సు మినహాయింపులు, సెన్సారు అనుమతులు, పోలీసు, ఆదాయపన్ను శాఖల దాడులనుండి రక్షణలు పొంది మిమ్మల్ని హీరోలుగా నెత్తిన పెట్టుకున్న జనంకోసం కనీసం ఒక్కసారైనా మీలో ఎవడెవడు హీరోగా నిలబడ్డాడు?

బయట ఎన్నికులాలు, ఎంతమంది ప్రతిభగలవాళ్లు, ఎంతమంది అవకాశం కోసం ఎదురుచూసేవాళ్ళు మీకోసం తమ జీవితాల్ని బలిపెట్టుకున్నారో మీకు తెలియదా? కాబట్టి సందిగ్దం వలదు. వెంటనే సినిమాలు మానేయండి.

మిగిలిన సినిమా హాళ్ల యజమానులు ఇప్పటికే తమ హాళ్లని కల్యాణ మండపాలుగా మల్చుకున్నారు. సైకిల్ స్టాండ్ కుర్రాడు వేరే వ్యాపారం పెట్టుకున్నాడు. కొత్త కుర్రాళ్లు తమ టాలెంట్ ప్రదర్శించుకోవడం కోసం తొక్కులాడుతున్నారు.

కాబట్టి మీ దోపిడీ ఆగాల్సిందే, కోటలు కూలాల్సిందే, సినిమా ప్రజాస్వామీకరణ చెందాల్సిందే, అందరికీ అవకాశాలు వుండాల్సిందే.

Also Read :

Siddharthi Subhas Chandrabose