అడ్డదిడ్డంగా రాస్తే కేసులే..!

లోక్ సభ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి పోటీ చేసిన సీఎం కేసీఆర్ కూతురు, కల్వకుంట్ల కవిత ఓటమితో ఆమెపై సోషల్ మీడియాలో విమర్శలు, ఆరోపణలు పెరిగిపోయాయి. సోషల్ మీడియాలో ఆమెపై చాలా వీడియోలు, రాతలు సర్క్యులేట్ అవుతున్నాయి. కొద్ది రోజులు వీటిని లైట్ తీసుకున్న ఆమె.. అవి కాస్తా శృతి మించడంతో పోలీసులకు కంప్లైంట్ చేశారు.

దీంతో.. గత కొన్ని రోజులుగా శ్రీమతి కల్వకుంట్ల కవిత వ్యక్తిగత పీఏలపై, జాగృతి నాయకులపై అఙ్ఞాత వ్యక్తులు చేస్తున్న అవాంఛిత, నిరాధార ఆరోపణలపై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

“సోషల్ మీడియాలో మెసేజీలు రాస్తున్న వారు తెలివిగా కవిత గారి అభిమానులమని చెప్పుకుంటూనే వీటిని రాసి ప్రచారం చేస్తున్నారు. కవితకు వ్యక్తిగతంగా కానీ వాట్సాప్ ద్వారా కాని ఈ విషయాలు చెప్పే అవకాశం ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో ఊరు పేరూ లేకుండా కల్పితాలను పదే పదే  ప్రచారం చేయడం కవిత మంచి కోసమో చెడు కోసమో అందరూ అర్థం చేసుకోవాలి. రాయడమే కాదు ఇలాంటి మెసేజీలు ఫేస్ బుక్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాలలో ఫార్వార్డ్ చేయడం కూడా సమానమైన నేరమని సీసీఎస్ పోలీసులు అంటున్నారు. ఇప్పటి వరకు శ్రీమతి కవిత గారి వద్ద పని చేసే 9 మందిని వివిధ మెసేజీలలో ప్రస్తావించినట్టుగా గుర్తించడం జరిగింది. ఇదంతా కేవలం శ్రీమతి కవిత వ్యతిరేకులు పనిగట్టుకొని చేస్తున్న విషప్రచారం అన్నది గ్రహించాలి. బాధ్యులు ఏ స్థాయిలో ఉన్నప్పటికీ చట్టప్రకారం శిక్షించటం జరుగుతుంది.”