మోజో టీవీ CEOపై కేసు

తెలుగు న్యూస్ మీడియాపై కేసుల పరంపర కొనసాగుతోంద. మొన్నీమధ్యే రవిప్రకాశ్ ను టీవీ9 నుంచి పంపించేసి.. కేసులు కూడా పెట్టారు. ఈ వ్యవహారం నడుస్తుండగానే మరో ఛానల్ పై కేసులు ఫైల్ అయ్యాయి. రవిప్రకాశ్ ఆధ్వర్యంలోనే రూపు దిద్దుకున్నట్టుగా చెబుతున్న మోజో టీవీపై కేసులు నమోదయ్యాయి.

మోజో టీవీ సీఈఓ రేవతి కి బంజారాహిల్స్ ఏసీపీ నోటీసులు ఇచ్చారు. అయ్యప్ప స్వామి శబరి ఆలయ ప్రవేశం వివాదం పై నాలుగు నెలలు క్రితం మోజో టీవీ చాలా లైవ్ చర్చాకార్యక్రమాలు నిర్వహించింది. అయితే.. ఈ చర్చా కార్యక్రమానికి ఆహ్వానించి.. ఓ దళితుడిని అవమానించారనే అభియోగాలపైకేసు ఫైల్ చేశారు. దీంతో మోజో టీవీ సీఈవో రేవతి, యాంకర్ రఘుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. వీరిని అరెస్ట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. వీటితో పాటు.. మరో మూడు కేసులు కూడా పెట్టిన పోలీసులు.. యాక్షన్ తీసుకునేందుకు రెడీ అయ్యారు.

దీంతో ఏకంగా టీవీ లైవ్ షో లోనే నిరాహారదీక్ష ప్రారంభించారు సీఈవో రేవతి. రాష్ట్రంలో మీడియాను కబ్జా చేసేశారని.. ఇంటర్ ఫలితాల ఇష్యూపై కథనాలు నడిపినందుకే తమపై అక్రమంగా కేసులు పెట్టారని ఆరోపిస్తున్నారు. మోజో టీవీ యాజమాన్యాన్ని బెదిరించి.. బలవంతంగా సంస్థను లాగేసుకునేందుకు మైహోం రామేశ్వరరావు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీనిపై కొన్ని గంటలుగా మోజో టీవీలో లైవ్ నడిపిస్తున్నారు.

లోక్ సభ ఎన్నికల ఫలితాల కవరేజీని సైతం పక్కనపెట్టేసి.. జర్నలిజం విలువలు కాపాడాలంటూ నిరసనకు దిగారు.