సండే స్పెషల్ : బోటీతో మజా


ఏం కూరనోయ్ పిల్లగా మీదియ్యాళ అని ఓ పెద్దమనిషి అప్పుడెప్పుడో అడిగిండు. బోటి కూర అని చెప్పిన. ఎహే గా బోటి తింటరా, ఇంత మటనో లేక చికెనో తినాలె గని అని ముక్కిరిసిండు. ఇక్కడ ఆ పెద్దమనిషికి బోటి కూర అంటే చిన్నచూపు. బోటి కూర పైసలున్నోళ్లెవలు తినరు, గరీబోల్లే బోటి కూర తింటరని ఆయన భావన ఆ రోజుల్లో నాకు స్పష్టంగా కనిపించింది. కానీ బోటి కూరలో ఉన్న రుచి ఏ మటన్ల, ఏ చికెన్‌లో కూడా దొరుకదని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. తెలంగాణ వంటకాలో్ల బోటికూరకు ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నదంటే దాని విలువేంటో చెప్పవచ్చు. అలాంటి బోటీ కూరను ఎట్ల వండుడో తెలుసుకుందాం.
కొందరు దానితోని పెట్టుకుంటే ఇగ ఒడువది, అగొడువది ఎందుకు తీయ్ రిస్క్ అని తప్పించుకుంటరు. కానీ బోటీ కూరలో ఉన్న రుచిని ఆస్వాదించాలంటే కొంచెం రిస్కు తీసుకోవాలిగా. ఓ కిలో బోటి ఇంటికాడ మంచిగ సాఫ్ చేయాలంటే ఎంతలేదన్న ఓ అద్దగంట అయితే పక్కా పడుతది. ముందుగాళ్ల మటన్ షాప్ నుంచి బోటీని తెచ్చినప్పుడు ముందుగాళ్లనే కట్ చేపించవద్దు. డైరెక్టు తీసుకొచ్చి బొంతను వేన్నీళ్లలు ముంచి తీయాలె. అప్పుడు బొంత ఉత్తగనే పోయి తెల్లగయితది. ఇగ పేగులను మాత్రం వేన్నీళ్లల వేయకుండా నల్ల కాడా ఫ్రెషర్‌తో నీల్లు కొడితే దాంట్లో ఉన్న కష్రా అంతా ఉత్తగనే సాఫ్ అయి, తెల్లగయితది. అప్పుడు మనం కట్ చేసుకోవాలి. ఇంత కూడా వాసన రాక మటన్ కన్న తెల్లగా కొడుతది. అంతే మళ్లిగ మటన్, చికెన్, తలికాయ, కాళ్ల షోరువా వండినట్టే రోటీన్‌గా వండాలి.
కిలో బోటిపేగులకు కావాల్సిన సామాన్లు… కట్ చేసుకున్న బోటీ పేగుల మీద ఓ రెండు శెంశల అల్లం, ఓ ఐదు శంశెల ఎర్రకారం, దగ్గట్టుండేంత ఉప్పు, చిటికెడు పసుపు వేసుకొని మంచిగ కలె గలుపుకొని పక్కన వెట్టుకోవాలి. ఇప్పుడు ఓ ఆరేడు పచ్చి మిరపకాయలు, ఓ రెండు ఉల్లిగడ్డలు కోసుకొని పెట్టుకోవాలె. అట్లనే రెండు కట్టల కొత్తిమీర, ఒక పూదీన కట్ట కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలె.
ఇప్పుడు స్టవ్ ముట్టించుకొని కుక్కెర గంజు పొయ్యిమీద పెట్టుకోవాలె. ఇంత నూనె పోసుకొని, అది వేడిగైనంక మిరపకాయ ముక్కలు, ఉల్లిగడ్డ ముక్కలు గంజుల వేసుకోవాలె. అవి మంచిగ బంగారం కలర్ వచ్చేదాంక స్టవ్ సిమ్ల పెట్టుకోవాలె. ఇప్పుడు కొంచెం కొత్తమీర, పూదీన వేసుకోవాలె. మల్లో రెండు నిమిషాలు అయినంక మల్లకొంచెం అల్లం వేసుకున్నంక ఇప్పుడు మల్ల కొంచం పసుపు వేసుకోవాలె. కారం ఉప్పు కలిపి పెట్టుకున్న బోటిపేగుల ముక్కలను గంజుల వేసుకొని ఓ ఐదు నిమిషాలు గోలియ్యాలె.
ఇప్పడు సరిపడా నీళ్లు పోసుకొని కుక్కెర మూత పెట్టాలి. ఇటు సిమ్ముల కాకుండా, అట్టు ఫుల్లు కాకుండా మధ్యల పెట్టాలె స్టవ్ మంటను. ఓ మూడు విజిల్ వచ్చినంక మూత తియ్యాలె. మాపకూల ఉడుకుతది. మీదికెళ్లి ఇంత ధనియాల పొడి ఏంచింది, పచ్చిది, ఇంత లవంగాలు, ఇలాయిపొడి వేసుకొని మంట పెద్దగ పెట్టి ఓ ఐదు నిమిషాలు ఉంచాలె. ఇగ దించే ముందు కొత్తిమీర పూదీన మీదికెళ్లి సల్లుకోవాలె. అంతే బోటీ కూర రెడీ. ఇగ వేడివేడి అన్నంల బోటి కూర వేసుకొని తింటా ఉంటే బుక్కబుక్కకు తాకే ఆ ముక్క రుచే వేరప్పా…
– సతీష్ కుమార్ గడ్డం