ఝార్ఖండ్ కీ ప్యారే మిత్రో.. ఇంత నిర్దయ ఎందుకు మీకు?

సమాజాన్ని నిట్టనిలువునా చీల్చెయ్యడానికి చట్టాలు తీసుకు వచ్చాం. ఆర్థికరంగం కుదేలవుతోందని, లక్షల మంది ఉద్యోగాలు పోగొట్టుకుని రోడ్డున పడుతున్నారని


సమాజాన్ని నిట్టనిలువునా చీల్చెయ్యడానికి చట్టాలు తీసుకు వచ్చాం. ఆర్థికరంగం కుదేలవుతోందని, లక్షల మంది ఉద్యోగాలు పోగొట్టుకుని రోడ్డున పడుతున్నారని, కంపెనీలు మూతపడుతున్నాయని — మీరు అడగకుండా – వేసుకునే బట్టల్ని బట్టి మనుషుల్ని చూడాలని చెప్పేం.
దేశానికి పెనుముప్పు మేమే అయినా, వేరే బట్టలు వేసుకున్నవారే అసలు శత్రువులని మీకు చెప్పేం. మిమ్మల్ని నమ్మమని చెప్పేం. ఆకలి సంగతి తర్వాత, ఆకాశమంత ఎత్తున్న గుడికడతామన్నాం. వాళ్ళు గెలిస్తే పాకిస్తాన్ ప్రజలకి వాళ్ళు పౌరసత్వం ఇవ్వబోతున్నారని బెదిరించాం. అబద్దాలాడాం. మీ దగ్గర గెలవాలని మాపార్టీ పాలిత రాష్ట్రాల్లో రక్తం పారించాం.
వాళ్ళని చెదపురుగులని చెప్పేం. ఆటంకవాదులని అన్నాం. మా బట్టలువంటి బట్టలు వేసుకున్నవారిని మాత్రమే దేశభక్తులుగా గుర్తిస్తామని, మిగతావాళ్లమని ఈ దేశం నుంచి వెంటతరుముతామని మీకు హామీ ఇచ్చాం. ఆ తర్వాత ఎందుకైనా మంచిదని అలా ఎన్నడూ అనలేదని అబద్దామాడేం. గుజరాత్ రోడ్లమీద రక్తంపారించామన్న సంగతి మీరు మరిచిపోయివుంటారని ‘హింస తప్పుకదా’ అని నీతి వచనాలు పలికాం.
మీకోసం మాట్లాడుతున్నవాళ్ళని, మీ పిల్లల్ని , మిమ్మల్ని అర్బన్ నక్సల్స్ అని తిట్టేం. మీకోసం పోరాడుతున్నవాళ్ళని భూమిలో ముప్పై అడుగుల లోపల పాతిపెట్టేశామని ప్రకటించాం. నన్ను అసహ్యించుకోండి, కానీ దేశాన్ని ప్రేమించండని మంచి డైలాగులు కొట్టాం.
అయినా ఎందుకు ఓడించారు, మిత్రో( ?! ఎందుకు ఓడించారు? ఎందుకు?!
ఇప్పుడు, ఢిల్లీలో, బెంగాల్ లో ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పుడు వాళ్ళకోసం ఏం కొత్త ఏడుపులు ఏడవాలి? మనుషుల్ని విడదీయడానికి ఇంకా ఎన్ని చట్టాలు చెయ్యాలి. చెప్పండి, మిత్రో(, చెప్పండి!


— కూర్మనాథ్