కిరాతకం… తహశీల్దార్ సజీవ దహనం

మంటలు అంటుకుని చావుకేకలు పెడుతూ… ఆఫీస్ గది నుంచి బయటకు వచ్చి దర్వాజ దగ్గరే పడిపోయింది విజయారెడ్డి. ఆ సమయంలో…

రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో సంచలన హత్య జరిగింది. అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ ఆఫీస్ లో తహశీల్దార్(ఎమ్మార్వో)విజయారెడ్డిని దారుణంగా హత్య చేసి చంపేశాడు ఓ దుండగుడు. ఆఫీస్ లో తహశీల్దార్ తో పని ఉంది.. మాట్లాడాలి అంటూ లోపలికి వెళ్లిన దుర్మార్గుడు…. ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించి చంపేశాడు. తహశీల్దార్ కు నిప్పంటించి ఆ మంటల్లో కాలిన నిందితుడు పారిపోతూ కొద్దిదూరంలోనే పడిపోయాడు. ఆమెను కాపాడే ప్రయత్నంలో మరో ఇద్దరు సిబ్బంది గాయపడ్డారు.

అది 4 అంతస్తుల భవనం. సడెన్ గా ఎవరో మహిళ అరుస్తోంది. ఆఫీస్ గదుల్లోని ఉద్యోగులు బయటకు వచ్చారు. మంటలు అంటుకుని చావుకేకలు పెడుతూ… ఆఫీస్ గది నుంచి బయటకు వచ్చి దర్వాజ దగ్గరే పడిపోయింది విజయారెడ్డి. మంటల్లో కాలుతున్నది ఎవరో తెలియక… ఎలా కాపాడాలో తెలియక… ఆఫీస్ ఉద్యోగులు గావుకేకలు పెట్టారు. అయ్యో అయ్యో… అంటూ…. ఓ దుప్పటి తెచ్చి ఆమెపై కప్పి మంటలు ఆర్పారు. ఆ మంటల్లో కాలిపోయింది తమ మేడమ్ అని తెలిసి వాళ్ల గుండెలు అదిరిపోయాయి. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు ఉద్యోగులు.

విజయారెడ్డిపై కిరోసిన్ పోసి నిప్పంటించిన వ్యక్తి పేరు కూర సురేష్. మంటల్లో అతడు కూడా గాయపడ్డాడు. 60 శాతం కాలిన గాయాలైన అతడిని పోలీసులు అదుపులోకి తీసుకుని.. హాస్పిటల్ లో చేర్పించారు. విచారణలో అతడు కొన్ని విషయాలు బయటపెట్టాడు. భూమి విషయంలో తగాదా ఉండటంతోనే ఈ పనిచేసినట్టు చెప్పాడు. తన పేరుపై రిజిస్టర్ అయిన భూమిని మ్యుటేషన్ చేయడానికి తహశీల్దార్ ఆలస్యం చేస్తోందని.. రేపు, రేపు అంటూ లేట్ చేస్తోందని.. ఈ కోపంతోనే తాను ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించానని పోలీసులకు చెప్పాడు నిందితుడు కూర సురేష్.

ఇది దారుణమైన సంఘటన అని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ చెప్పారు. నిందితుడు తమ అదుపులోనే ఉన్నాడని అన్నారు.