బీజేపీలోకి MPలు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి…?

తెలంగాణ రాష్ట్రంలో మరో రాజకీయ సంచలనం నమోదవుతోంది. ఇటీవలి లోక్ సభ ఎన్నికల్లో గెలిచిన ఇద్దరు కాంగ్రెస్ ఎంపీలు… బీజేపీలో చేరబోతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇద్దరూ అతిత్వరలోనే బీజేపీలో చేరబోతున్నట్టు తెలుస్తోంది.

ఎంపీలు రేవంత్, కోమటిరెడ్డిలతో పాటు.. మరికొందరు కూడా బీజేపీలో జాయిన్ అవుతున్నట్టు సమాచారం అందుతోంది. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా కాషాయం కండువా కప్పుకోనున్నట్టు వార్తలు బయటకు వస్తున్నాయి. హైదరాబాద్ లో మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామిని ఆయన ఆఫీస్ లో కలిసి కొద్దిసేపు చర్చించారు ఎంపీ రేవంత్ రెడ్డి. బీజేపీలో చేరే అంశంపై ఈ భేటీలో చర్చ జరిగినట్టుగా చెప్పుకుంటున్నారు. కేసీఆర్ అన్నకూతురు కల్వకుంట్ల రమ్య కూడా బీజేపీలో చేరాలనుకుంటున్టట్టు సమాచారం.

బీజేపీలో చేరాలనుకుంటున్న నాయకులు… ఢిల్లీలో బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ తో చర్చించినట్టు ఢిల్లీ మీడియా ప్రతినిధులు, బీజేపీ వర్గాలు చెబుతున్నారు.

సీఎల్పీని టీఆర్ఎస్ లో విలీనం చేసేయడంతో.. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ కు మంచిరోజులు లేవని నేతలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. హిస్టరీని తిరగరాస్తూ.. బీజేపీ భారీ మెజారిటీతో మరోసారి కేంద్రంలో అధికారంలోకి రావడం… కాంగ్రెస్ కు మరో పదేళ్లవరకు గడ్డు పరిస్థితులు కనుచూపుమేరలో ఉన్నాయన్న అభిప్రాయంతో హస్తం నేతలు పార్టీ మారాలనుకుంటున్నట్టుటాక్ వినిపిస్తోంది. అక్కడక్కడా మిగిలి ఉన్న టీడీపీ కేడర్ కూడా బీజేపీ వైపు చూస్తోంది.

టీఆర్ఎస్ ముఖ్యనేత హరీష్ రావు బీజేపీలో చేరతారని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతోంది. ఐతే.. ఈ వార్తలను ఆయన ఎప్పటికప్పుడు తోసిపుచ్చుతూ వచ్చారు. ఈలోపే.. బీజేపీ గాలి గట్టిగా వీస్తోంది.