కేసీఆర్ ఎమ్మెల్యేలను ఎందుకు కలుపుకున్నారంటే..?

రాష్ట్ర రాజకీయాలను జాగ్రత్తగా పరిశీలిస్తున్న వారు… పార్టీ ఫిరాయింపుల విషయాన్ని చాలా కోణాల్లో విశ్లేషిస్తున్నారు. అందులో.. ఆసక్తిరేపుతున్న… విస్తృతంగా చర్చ జరుగుతున్న ఓ అంశం ఒకటుంది. 88మంది ఎమ్మెల్యేల బలంతో.. సగర్వంగా తెలంగాణలో రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన గులాబీ దళపతి కేసీఆర్.. 12 మంది ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ కలుపుకోవడానికి ఎందుకు ఆసక్తి చూపారన్నదే ఆ అంశం. ఈ 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కలిస్తే టీఆర్ఎస్  సెంచరీ కొడుతుంది. అంతేకాదు… ప్రభుత్వం కుప్పకూలకుండా గట్టి గోడ కట్టినట్టుగా ఉంటుంది అన్నది కొందరు పరిశీలకుల విశ్లేషణ.

టీఆర్ఎస్ లో కేసీఆర్ తర్వాత అత్యంత బలమైన లీడర్ హరీష్ రావు అన్న సంగతి వేరే చెప్పాల్సిన పనిలేదు. హరీష్ రావును ఉద్దేశపూర్వకంగా టీఆర్ఎస్ నాయకత్వం పక్కన పెడుతోందన్నది కనపడుతున్న విషయమే. కేసీఆర్ తన కొడుకు కేటీ రామారావును ఇప్పటికే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ను చేశారు. ఇక అధికార వారసత్వం అందివ్వడానికి జరుగుతున్న ప్రయత్నాలు… పరుస్తున్న సోపానాలే ఇవన్నీ అంటున్నారు కొందరు. అంచనాలు నిజమైతే.. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించిన కొద్దిరోజులకే మంత్రివర్గ విస్తరణ చేస్తారని తెలుస్తోంది. ముఖ్యమంత్రిగా కేటీఆర్ కు పగ్గాలు అప్పచెబుతారని వినిపిస్తోంది.

టీఆర్ఎస్ 2.0 సర్కారుకు మరో నాలుగున్నరేళ్ల టైమ్ ఉంటుంది. ఆలోపు అంటే.. మరో రెండేళ్ల తర్వాత గనుక టీఆర్ఎస్ లో చీలిక వచ్చినా ప్రభుత్వం పడిపోకుండా ఉండేందుకే ఈ ఫిరాయింపులు అని చెబుతున్నారు. రెండేళ్ల తర్వాత హరీష్ రావు తన బలం నిరూపించుకునేందుకు  40 మందితో రెబల్ గ్రూప్ తయారుచేసినా… వేరే పార్టీలోకి చేరినా.. టీఆర్ఎస్(కేటీఆర్) ప్రభుత్వానికి ఇబ్బంది రాకుండా ఉంచేందుకే ఈ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నట్టుగా రాజకీయ వర్గాల్లో చెప్పుకుంటున్నారు.

ఫిరాయింపులను ప్రోత్సహించడంపై విమర్శలు ఎన్ని వచ్చినా.. ఒకనాడు తాను చెప్పిన నీతినే తప్పుతున్నా.. కేసీఆర్… రాజకీయ వ్యూహంలో అదంతా భాగమేనంటున్నారు పరిశీలకులు.