పాత కేసులు తోడి.. మీడియాపై దాడి..!

టీవీ9తో మొదలైన చిరుజల్లు.. ఇప్పుడు గాలిదుమారమై.. వడగండ్ల వర్షమై కూర్చుంది. పంటచేతికొచ్చే సమయంలో రైతులను నిండా ముంచే చెడగొట్టు వానలా.. కొన్ని తెలుగు న్యూస్ ఛానళ్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. సీఈవో గా ఉన్న రవిప్రకాశ్ బయటకు పంపించేసి.. టీవీ9ను టేకోవర్ చేశారు కేసీఆర్ కు సన్నిహితుడైన మైహోం రామేశ్వరరావు. రవిప్రకాశ్ పై కేసులు కూడా పెట్టారు. సంతకాలు ఫోర్జరీ చేశారని, లోగో అమ్ముకున్నారని వగైరా.. వగైరా కేసులు పెట్టారు.

ఆ విషయాన్ని కాస్త పక్కన పెడితే…

టీవీ9 సీఈవో గా ఉన్న సమయంలోనే రవిప్రకాశ్ ఆలోచనల నుంచి మోజోటీవీ అనే ఓ తెలుగు న్యూస్ ఛానల్ పుట్టుకొచ్చింది(ఈ విషయం ఎవరూ అధికారికంగా చెప్పరు. కానీ మోజో వెనకాల ఉన్నది రవిప్రకాశేననేది మీడియాలో అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం).

మోజో టీవీ చైర్మన్ ఓ ఎన్నారై అయినప్పటికీ.. దాని వ్యవహారమంతా రవిప్రకాశే నడిపిస్తున్నారట. టీవీ9 నుంచి ఉధ్వాసనకు గురైన ఆయన.. కేసుల యవ్వారం ముగిశాక.. మోజోను పూర్తిస్థాయిలో టేకోవర్ చేసే ఆలోచనలో ఉన్నారట. అయితే.. ఆయన ప్రత్యర్థులు మాత్రం అంతకంటే స్పీడ్ ఉన్నారు. ముందుగానే ఆయనకు షాక్ ఇచ్చారు. మోజో టీవీకి స్పాట్ పెట్టారు.

మోజో టీవీ CEOపై కేసు

ప్రస్తుతం.. రవిప్రకాశ్ మాస్టర్ మైండ్ తో.. ఓ ఎన్నారై అండ్ రవిప్రకాశ్ పెట్టుబడితో ఉన్న మోజో టీవీని టేకోవర్ చేసేందుకు మైహోం రామేశ్వరరావు ప్రయత్నాలు మొదలుపెట్టేశారట. తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నారట. మేనేజ్ మెంట్ ఒత్తిడితో పాటు.. సీఈఓ గా ఉన్న రేవతికి పోలీసులు నోటీసులు ఇచ్చారు.

అదేదో ఇప్పుడు జరిగిన తప్పుల గురించి కాదు.. పాత కేసులు తిరగతోడి మరీ మోజో టీవీ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని.. సీఈఓ రేవతి ఆరోపిస్తున్నారు. ఏకంగా లైవ్ లోనే నిరాహార దీక్ష మొదలు పెట్టారు. దీనికి తోడు.. మోజో టీవీ ప్రసారాల లైవ్ టెలికాస్ట్ కూడా ఆపేశారట. మోజోటీవీకి శాటిలైట్ లింకింగ్ సేవలందిస్తున్న ఇండియాసైన్ సంస్థకు వార్నింగ్ ఇచ్చి ఈ పని చేయించారనే ఆరోపణలు వస్తున్నాయి.

అయితే.. తెలంగాణలో మీడియా మొత్తాన్ని తమ గుప్పిట్లోకి తీసుకోవాలనే ఉద్దేశంతోనే తమపై కక్ష సాధిస్తున్నారని మోజో సిబ్బంది అంటున్నారు.

అంతా కార్పొరేట్ వ్యవహారం. మేనేజ్ మెంట్ ల మధ్యలో సవాలక్ష ఉండొచ్చుగానీ.. ఇప్పుడు తమ పరిస్థితి ఏంటని తలపట్టుకుంటున్నారు.. మోజో టీవీలో పనిచేసే జర్నలిస్టులు..!